తెలంగాణకు మోడీ ఏం చేశాడని పర్యటనలు

తెలంగాణకు మోడీ ఏం చేశాడని పర్యటనలు
  • తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తున్నా నిస్సిగ్గుగా మోడీ పర్యటన
  • జాతి సంపదను కార్పోరేట్లకు దోచిపెడుతున్న బిజెపికి దేశాన్ని పాలించే అర్హత లేదు
  •  తెలంగాణ బొగ్గు బ్లాకులు ఇక్కడి ప్రజలకే చెందాలి
  •  మతోన్మాద శక్తులకు తెలంగాణలో స్థానం లేదు
  • భారత సమాజాన్ని నట్టేట ముంచుతున్న కాషాయ సర్కార్ను సాగనంపుదాం
  •  సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: విభజన చట్టాలను తుంగలో తొక్కి రాజకీయ కక్షతో తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తున్న  ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ గడ్డపై అడుగు పెట్టే నైతిక హక్కు లేదని, గడిచిన తొమ్మిదేళ్ళలో తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని నిలదీస్తున్న తెలంగాణ సమాజానికి సమాదానం చెప్పి ఇక్కడ పర్యటించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా అన్నారు. మోడీ పర్యటనను నిరసిస్తూ సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ పిలుపులో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని పోస్టాఫీస్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల దుస్తులు, నల్ల జెండాలతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అనంతరం పోస్టాఫీస్ సెంటర్లో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన చట్టంలోని బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా వంటి హామీలను నెరవేర్చకుండా కేంద్రం తెలంగాణ పట్ల వివక్షత చూపుతుందన్నారు. సరళీకరణ, ప్రైవేటీకరణ పేరిట ప్రజలపై గుదిబండ మోపుతున్నారని, లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పోరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు.

తెలంగాణకు గుండెకాయలాంటి బొగ్గు నిక్షేపాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే కుట్రలకు పూనుకుంటున్నారని, అందులో భాంగానే తెలంగాణలోని సింగరేణి సంస్థకు చెందిన కేఓసి-3, కెవిఆర్ ఓసి-3, కెకె–6 ఇంక్లైన్, శ్రావణపల్లి ఓసీ గనిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి తెలంగాణ సంపదను దోచిపెడుతున్నారని విమర్శించారు. పెట్రోల్ డీజిల్, గ్యాస్ నిత్యావసర వస్తువులు, రైల్వే చార్జీల పెంపు వంటి చర్యలు అదానీ అంబానీలను కుబేరులను చేస్తే దేశ ప్రజలను దివాలా తీయించాయన్నారు. మతోన్మాదాన్ని పెంచిపోషిస్తూ ప్రజల మధ్య చిచ్చు రేపుతున్నారని, ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్న బిజెపికి తెలంగాణలో స్థానం ఇవ్వబోమన్నారు.

ప్రైవేటు యాజమాన్యాలకు, పెట్టుబడి దారులకు హక్కులు తాకట్టుపెట్టే విధంగా కార్మిక చట్టాల సవరణకు పూనుకుంటున్నారని అన్నారు. తెలంగాణకు ఏ ఒక్క మేలు చేయకుండా తెలంగాణలో మోడీ అడుగు పెట్టిన ఏప్పిల్ 8 తెలంగాణ ప్రజలకు చీకటి రోజేనన్నారు. భారత సమాజాన్ని నట్టేట మంచుతున్న కాషాయ సర్కార్ను సాగనంపేందుకు భారత సమాజం సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాపితంగా అరెస్టైన సిపిఐ నాయకులను, కార్యకర్తలను భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో సిపిఐ నాయకులు బందెల నర్సయ్య, వై.శ్రీనివాసరెడ్డి, దమ్మాలపాటి శేషయ్య, వాసిరెడ్డి మురళి, భూక్య దస్రు, కందుల భాస్కర్, భూక్య శ్రీనివాస్, నగేష్, , జక్కుల రాములు, నాయకులు బోయిన విజయ్ కుమార్, నేరెళ్ళ శ్రీనివాస్, షాహీన్, తదితరులు పాల్గొన్నారు.