సమస్యలను పరిష్కరించాలి: న్యూ డెమోక్రసీనేత మధు

సమస్యలను పరిష్కరించాలి: న్యూ డెమోక్రసీనేత మధు

ముద్ర ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం: స్వయం సహాయక సంఘాల సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని, పాత రుణాలను రద్దుచేసి, కొత్తగా వడ్డీ లేని రుణాలను మంజూరు చేయాలని సిపిఐ(యం.యల్)న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు, ప్రగతిశీల మహిళా సంఘం(POW) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  అందే మంగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఇల్లందు వ్యవసాయ మార్కెట్లో జరిగిన సభలో వారు మాట్లాడారు. కేసిఆర్ ప్రభుత్వం ఐకెపి మహిళా సంఘాలను చిన్నచూపు చూస్తోందని, సవతితల్లి ప్రేమ కనబరుస్థూ,ఈ రంగాన్ని నిర్వీర్యం చేయటానికి ప్రయత్నం చేస్తోందని అన్నారు. ఇప్పటికైనా ఐకెపి గ్రూపు లోని ప్రతి సభ్యురాలికి 10 లక్షల రూపాయల లోను మంజూరు చేయాలని, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, పొదుపు సంఘాలన్నింటికీ 20 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇవ్వాలని, అభయాస్తం పింఛన్ పథకం పునరుద్ధరించాలని, జనశ్రీ, ఆమాద్మీ బీమా యోజన పథకాలను కొనసాగించాలని, శ్రీనిధి మహిళా బ్యాంకులను గ్రామ పరిధిలోని ఏర్పాటు చేయాలని, మహిళలoదరికీ ఉపాధి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ రంగంలో పనిచేస్తున్న అన్ని రకాల ఉద్యోగులందర్నీ రెగ్యులరైజ్ చేయాలని, గ్రామ సంఘ సహాయకులకు, బుక్ కీపర్లకు 10వేల రూపాయల గౌరవ వేతనంఇవ్వాలని,ప్రతి సభ్యురాలికి పది లక్షల రూపాయల లోను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సభకు ముందుగా ఇల్లందు పట్టణంలో మహిళలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అరుణోదయ కళాకారుల డప్పు డాన్స్, కోలాటము ప్రదర్శన అగ్రభాగాన నడిచింది. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల జడ్పిటిసి వాగబోయిన రామక్క, తుపాకుల నాగేశ్వరరావు, తోడేటి నాగేశ్వరరావు, పొడుగు నరసింహారావు, వై. జానకి, పరకాల లక్ష్మి, తిరుపతమ్మ, వీరమల్ల ఉమా, కల్తీ కోటమ్మ, సుభద్ర,కవిత, పోలారం సర్పంచ్ వాంకుడోత్ సరోజన, ఎంపీటీసీ ఈసాల పాపమ్మ, కల్తి వెంకటేశ్వర్లు వై.గోపాల్ రావు,సురేందర్ మోత్కూరి మల్లికార్జున రావు,  తదితరులు పాల్గొన్నారు.