ప్రజలకు భరోసా కల్పించే కేంద్రాలు కమ్యూనిస్టు కార్యాలయాలు

ప్రజలకు భరోసా కల్పించే కేంద్రాలు కమ్యూనిస్టు కార్యాలయాలు
  • ప్రజలకు భరోసా కల్పించే కేంద్రాలు కమ్యూనిస్టు కార్యాలయాలు
  • ప్రజా సమస్యల పరిషాకరంకోసం ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడం
  • ఎర్రజెండాను ఆదరిస్తేనే పేదవర్గాల మనుగడ
  • సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వందేళ్ళుగా ప్రజలకు ఎనలేని సేవలందిస్తూ కమ్యూనిస్టు కార్యాలయాలు ప్రజలకు భరోసా కల్పించే కేంద్రాలుగా నిలుస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. చుంచుపల్లి మండల పరిధిలోని బాబూక్యాంపు ఏరియా మెయిన్ రోడ్డులో నూతనంగా నిర్మించనున్న 'రజబ్ అలిభవన్' నిర్మాణానికి ఆదివారం కూనంనేని శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన శంకుస్థాపన సభలో ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీకి, కమ్యూనిస్టు ఉద్యమాలకు వందేళ్ళకుపైగా చరిత్ర ఉందని, ఎందరో తాగదనులు నిర్మించిన కమ్యూనిస్టు పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన భాద్యత నేటితరం నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. నూతనంగా నిర్మిస్తున్నరజబ్ అలి భవన్తో ప్రజలకు మరింత సేవలు అందుతాయన్నారు.

చుంచుపల్లి మండలంలో అనాదిగా సిపిఐ పార్టీని ప్రజలు ఆదరిస్తూ తగిన గుర్తింపును అందిస్తున్నారని, వారి ఆలోచనలకు అనుగుణంగా పార్టీ శ్రేణులు ప్రజల్లో మరింత మమేకమై పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంకోసం ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఎర్ర జెండాను ఆదిరిస్తేనే సమాజానికి మనుగడ ఉంటుందని, సమస్యలు పరిష్కరించబడతాయని ప్రజలు గుర్తించాలన్నారు. ఎన్నికల ముందు వచ్చే నాయకులు, వారి తాత్కాలిక కార్యాలయాలు వ్యక్తిగత స్వార్ధంకోసమేనని, కమ్యూనిస్టు నాయకత్వం, కార్యాలయాలు ప్రజలకు అంకితమై పనిచేస్తాయని పునరుద్ఘాటించారు.

త్వరిగతిన కార్యాలయం నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. మండల సిపిఐ కార్యదర్శి వాసిరెడ్డి మురళి అధ్యక్షతన జరిగిన శంకుస్థాపన సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు బందెల నర్సయ్య, ముత్యాల విశ్వనాధం, దుర్గరాశి వెంకన్న, వై.శ్రీనివాసరెడ్డి, జిల్లా సమితి సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మండల నాయకులు వి.పూర్ణ, జమలయ్య, బానోతు గోవిందు, బాదావత్ సుగుణ, సిహెచ్. మాదవరావు, బాగం మహేశ్వర్రావు, బాగం మాదవరావు, మార్చర్ల శ్రీనివాస్, పిడుగు శ్రీనివాస్, బోయిన విజయ్ కుమార్,   తదితరులు పాల్గొన్నారు.