ప్రజాస్వామిక లౌకిక శక్తులు ఏకం కావాలి

ప్రజాస్వామిక లౌకిక శక్తులు ఏకం కావాలి
  • బిజేపిని గద్దె దింపే వరకూ విశ్రమించేదే లేదు
  •  బిజేపిని సాగనంపేందుకే బి ఆర్ ఎస్ తో దోస్తీ
  • సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దేశ సమగ్రత, సమైఖ్యతకు విఘాతం కలిగించే బిజేపిని గద్దె దింపేందుకు ప్రజా స్వామిక లౌకిక శక్తులు ఏకం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈనెల 14వ తేదిన భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని చర్ల మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి నాడు ప్రారంభమైన ప్రజాపోరు యాత్ర భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గ కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో  గురువారం ముగిసింది.  రుద్రంపూర్ నుండి బయలు దేరిన ప్రజాపోరుయాత్ర ర్యాలీ రామవరం, విద్యానగర్, బాబూక్యాంపు, పోస్టాఫీస్ సెంటర్, భజనమందిరం, సూపర్ బజార్, గణేష్ టెంపుల్ మీదుగా సాగింది. అనంతరం సూపర్ బజార్ సెంటర్లో ముగింపు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ దేశంలో అధికారం చెలాయిస్తున్న బిజేపి ప్రభుత్వం ప్రజలను నయవంచన చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశభక్తి పేరుతో అధికారంలోకి వచ్చి స్నేహ ప్రీతిని ప్రదర్శిస్తూ అదాని, అంబానీలకు దేశ సంపదను దోచి పెడుతున్నారని మండిపడ్డారు. మతోన్మాదం పేరుతో దేశాన్ని విచ్చిన్నం చేసేందుకు ఆర్ఎస్ఎస్ అదేశాలను  నుసరిస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతూ, రాముని పేరు జపిస్తూ రాక్షస పాలన సాగుస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో బిజేపి ఆగడాలకు అడ్డుకట్ట వేయకుంటే దేశం సర్వనాశం అవుతుందని, అందుకు పొరుగుదేశమైన పాకిస్తానే నిదర్శనం అన్నారు. దేశవ్యాప్తంగా బిజేపికి వ్యతిరేకంగా పనిచేస్తున్న అన్ని శక్తులను కలుపుకుని బిజేపిని గద్దె దించేంత వరకు విశ్రమించేదే లేదన్నారు. ఈ దేశం ఎవడబ్బ సొత్తూ కాదని, భారత రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలని, రాజ్యాంగ పరమైన పాలన సాగాలి కానీ సొంత ఎజెండాను ప్రజలపై రుద్ది పరిపాలిస్తే చూస్తూ ఊరుకోమన్నారు.

దేశంలో ధరలు నానాటికీ పైపైకి పోతున్నాయని, వాటిని అదుపుచేయడంలో మోడి ఘోరంగా విఫలమయ్యారన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యవసరాలు కొనే పరిస్థితి లేదని, దీనికి పాలకుల విధానాలే కారణం అన్నారు. కార్మిక చట్టాలను కాలరాసి లేబర్ కోడ్లు మార్చారని, చెమట చుక్కలు చిందించి, నెత్తురు దారపోసి కమ్యూనిస్టులు సాధించిన కార్మిక చట్టాలను బ్రతికించుకుంటామని అన్నారు. కమ్యూనిస్టులు లేరు, వారి పనిపోయిందని అని తప్పుడు ప్రేలాపనలు పేలుతున్న వారికి ఈ ప్రజాపోరు యాత్ర ఓ చెంప పెట్టువంటిదని, అధికారం, పదువులు ఉన్నా లేకున్నా నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండేది కమ్యూనిస్టులేనని అన్నారు. జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, గిరిజన, గిరిజనేతరులకు పోడు పట్టాలివ్వాలని, జిల్లాలో సాగునీటి వనురుల మరింత కల్పించాలని, అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని అన్నారు. ఆత్మీయ సమ్మేళనాలతో ఒరిగేదేమీ లేదని, పూటకో రంగు మార్చే వారితో అభివృద్ధి అసాధ్యమని చెప్పారు. ధన బలం చూసుకుని జనాలను కొనేవారు వారి గుండెల్లో ఎప్పటికీ స్థానం సంపాదించలేరని చెప్పారు.

అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య మాట్లాడుతూ ఉధ్యమాల పురిటిగట్టపై అనేక మంది వచ్చిపోతుంటారని, కానీ నిరంతరం ప్రజలతో ఉండేది కమ్యూనిస్టులు మాత్రమే అన్నారు. పోరుయాత్ర ముగింపు సభకు విఘాతం కలిగించినప్పటికీ ప్రజలదీవెనలతో సభ విజయవంతంగా జరిగిందని చెప్పారు. వై.శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు బందెల నర్సయ్య, గుత్తుల సత్యనారాయణ, కల్లూరి వెంకటేశ్వరరావు, మున్నా లక్ష్మి కుమారి, నరాటి ప్రసాద్, దుర్గరాశి వెంకటేశ్వర్లు, సలిగంటి శ్రీనివాస్, చంద్రగిరి శ్రీనివాసరావు, సరెడ్డి పుల్లారెడ్డి, వై.భాస్కర్రావు, దమ్మాలపాటి శేషయ్య, జి.వీరస్వామి, వంగా వెంకట్, భూక్య దస్రు, కంచర్ల జమలయ్య, జి.నగేష్, జక్కుల రాములు, కొమారి హన్మంతరావు, సోందే కుటుంబారావు, భూక్య శ్రీనివాస్, పోలమూరి శ్రీనివాస్,  మాచర్ల శ్రీనివాస్, పబోయిన విజయ్ కుమార్, మునిగడప వెంకటేశ్వర్లు, పద్మ, పి.సత్యనారాయణచారి తదితరులు పాల్గొన్నారు.