రాముడుకిచ్చిన మాట తప్పారు

రాముడుకిచ్చిన మాట తప్పారు
  • ప్రజలకిచ్చిన హామీలు అమలు చేస్తారా?
  • టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
భద్రాచలం రాములవారినే మోసం చేసిన సీఎం కేసీఆర్ కు ప్రజలను మోసం చేయటం మామూలు విషయమేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హాత్ సే హత్ జోడో యాత్రను ఆయన ఎనిమిదో రోజు సారపాక నుంచి భద్రాచలం అంబేద్కర్ సెంటర్ వరకు సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్కతో కలిసి నిర్వహించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ‘విభజించు–పాలించు’  విధానంతో  పాలన సాగిస్తోందని ఆరోపించారు. దేశ సమగ్రతను కాపాడేందుకు రాహుల్ భారతో జోడో యాత్ర చేశారన్నారు. బీఆర్ఎస్ నిర్లక్ష్యం కారణంగా గొప్ప చరిత్ర కలిగిన భద్రాచలం గుర్తింపు కోల్పోయిందన్నారు. కేసీఆర్ శ్రీరామునికి తలంబ్రాలు ఇవ్వడానికి రావడం లేదని,100 కోట్లతో శ్రీరాముడి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్న హామీ గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి వరద ముంపు బాధితులను ఆదుకుంటామని మోసం చేశారని విమర్శించారు. సీతారామ ప్రాజెక్టు కోసం తీసుకున్న భూములకు ఇప్పటికీ  పరిహారం అందలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ కు అమ్ముడుపోయిన  పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నాయకులు హనుమంతరావు మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు.