విద్యార్థులు ఆందోళనకు గురికావద్దు జిల్లా కలెక్టర్ అనుదీప్

విద్యార్థులు ఆందోళనకు గురికావద్దు జిల్లా కలెక్టర్ అనుదీప్

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పరీక్షల సమయంలో విద్యార్థులు ఎటువంటి ఆందోళనలకు, వత్తిల్లకు గురికావద్దని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. నేటి నుండి ఇంటర్ ప్రధమ ద్వితీయ పరీక్షలు ప్రారంభం కానున్న సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ  మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు పరీక్షలు మంచిగా వ్రాస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసే పరీక్షలను ప్రశాంతంగా రాసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

ఒత్తిడికి గురయ్యే విద్యార్థులలో ఆత్మస్థర్యాన్ని నింపేందుకు, పరీక్షలు అంటే భయాన్ని పోగొట్టేందుకు ప్రత్యేకంగా 14416 టెలిమానస్ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామన్నారు. టెలిమానస్ కు కాల్ చేస్తే నిపుణులైన మానసిక వైద్యులు ఉచిత కౌన్సిలింగ్ సేవలు అందిస్తారని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు, విధులు నిర్వహించే సిబ్బందికి ఎవరికీ సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లడానికి అనుమతి లేదని అన్నారు. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడతాయని, ఒక్క నిమిషం నిబంధన అమలులో ఉన్నందున విద్యార్థులు నిర్ణీత సమయం కంటే ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు.