హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలి జిల్లా కలెక్టర్ అనుదీప్

హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలి జిల్లా కలెక్టర్ అనుదీప్

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఆరోగ్య మహిళ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో మహిళా ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు, సిపిఆర్ నిర్వహణపై వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆరోగ్య సమస్య పరిష్కారానికి ఆరోగ్య మహిళా కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఎనిమిదో తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఎనిమిది రకాల అనారోగ్య సమస్యలకు ఉచిత వైద్యం అందించేందుకు జిల్లాలోని ఎర్రగుంట ,పర్ణశాల, ఎంపీ బంజర ,కొమరారం ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఆరోగ్య కేంద్రాలలో ప్రతి మంగళవారం మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు, ఓరల్, సర్వేకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్, థైరాయిడ్, సూక్ష్మ పోషకలోపాలు, తదిదర వ్యాధులకుపరీక్షలు నిర్వహించి  వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. మున్సిపాలిటీలు, పంచాయతీలలో మహిళా స్వయం సహాయక సంఘాల్లో మహిళా ఆరోగ్య కేంద్రాల్లో అందించే వైద్య సేవలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి మహిళ పరిపూర్ణ ఆరోగ్యవంతురాలుగా ఉండాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న ఆరోగ్య కేంద్రాలను మహిళలు సద్విని చేసుకొని పరిపూర్ణ ఆరోగ్యవంతురాలుగా ఉండాలని ఆకాంక్షించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారిని డాక్టర్ శిరీష, డిపిఓ రమాకాంత్, ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ రవిబాబు, ఆర్డీవో స్వర్ణలత, జిల్లా శాఖ అధికారులు పాల్గొన్నారు.