ప్రయాణికుల నౌకలో అగ్నిప్రమాదం.. 31 మంది మృతి

ఫిలిప్పైన్స్‌లో విషాదం నెలకొంది. స్థానికంగా దీవుల మధ్య రాకపోకలు సాగించే ఓ ప్రయాణికుల నౌక లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో.. దాదాపు 31 మృతి చెందారు. మృతుల్లో ఆరు నెలల పాప కూడా ఉంది. కోస్ట్‌గార్డ్ అధికారుల వివరాల ప్రకారం.. దక్షిణ ఫిలిప్పైన్స్‌లోని బసిలాన్ ద్వీపం వద్ద బుధవారం రాత్రి సమయంలో ‘ఎంవీ లేడీ మేరీ జాయ్ 3’ అనే ప్రయాణికుల నౌకలో మంటలు చెలరేగాయి. ఘటనా సమయంలో.. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఫెర్రీలో కింది డెక్‌లోని ఏసీ క్యాబిన్స్‌లో నిద్రిస్తున్నారు.  

అగ్నిప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో నీళ్లలోకి దూకడంతో.. 10 మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే నౌక వద్దకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. గురువారం తెల్లవారు జామునాటికి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తదనంతరం.. నౌకలో కాలిపోయిన స్థితిలో మరో 21 మంది మృతదేహాలు బయటపడ్డాయని స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో 35 మంది సిబ్బందితోసహా మొత్తం 230 మందిని రక్షించినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించే దిశగా దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.