సామ్యవాద స్వాప్నికులకు 'విప్లవ స్వాగతం'

సామ్యవాద స్వాప్నికులకు 'విప్లవ స్వాగతం'

సామ్రాజ్యవాద వ్యతిరేక  సమర పతాకగా, సామ్యవాద అమర ప్రతీకగా నిత్యనూతనంగా వెలుగొందుతున్న గొప్ప వైద్యుడు, నిబద్ధత గల కమ్యూనిస్ట్,  సోషలిస్ట్ క్యూబా మాజీ పరిశ్రమల శాఖ మంత్రి  మరియు గెరిల్లా యుద్ధ సిద్ధాంతకర్తగాను ప్రపంచవ్యాప్తంగా పేరు గడించారు. ఆయన బొలివియా ప్రభుత్వానికి  వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటుకు నాయకత్వం వహించి చివరకు కుట్రపూరితంగా 1967, అక్టోబర్ 9 నాడు అమరత్వం పొందారు. ప్రపంచవ్యాప్తంగా సోషలిస్ట్ ఉద్యమాలకు ఐకాన్ గాను మరియు ఆదర్శ నేతగాను నిలిచిన ఆ ఎర్నెస్టో చేగువేరా కూతురు అలైదా గువేరా మరియు మనుమరాలు ప్రొఫెసర్ ఎస్తేఫానియా గువేరాలు  ఈ నెల 23 నాడు విజయవాడలో లో నిర్వహింపబడే  'క్యూబా సంఘీభావ సభా' కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేయనుండడం దేశవ్యాప్తంగా సామ్యవాద స్వాప్నికులకు  గొప్ప కమ్యూనిస్ట్ చైతన్యాన్ని కలిగించడమే కాకుండా విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అప్పటి క్యూబా అధ్యక్షుడు ఫెడల్ కాస్ట్రో ఆదేశాలతో ఆసియా - ఆఫ్రికా దేశాలతో దౌత్య సంబంధాల ఏర్పాటుకు మూడు నెలల పాటు చేగువేరా పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగానే ఆయన 1959 లో భారతదేశాన్ని పర్యటించారు. ఆయన కూతురు అలైదా గువేరా 2019 లో సామ్రాజ్యవాద వ్యతిరేక క్యూబా 60 వ వార్షికోత్సవం సందర్భంగా భారతదేశంలో పర్యటించారు. ఆమె తాజాగా మరోసారి భారతదేశాన్ని సందర్శించి దేశంలోని అనేక ప్రాంతాలలో నిర్వహిస్తున్న క్యూబా సంఘీభావ సభలలో ప్రసంగాలు చేస్తూ  సామ్యవాద  స్వాప్నికులలో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తున్నారు.

     ఎర్నెస్టో చేగువేరాకి గల రెండవ భార్య అలైదా మార్చికి  1960, నవంబర్ 24 నాడు  అలైదా గువేరా జన్మించారు. ఆమె హవానా లోని సోలార్ చిల్డ్రన్ హాస్పిటల్ లో  శిశు వైద్యురాలు. అంగోలా, ఈక్వెడార్ మరియు నికరాగ్వా మొదలైన  దేశాలలో కూడా ఆమె వైద్యురాలుగా సేవలు అందించారు.  అలాగే ఆమె మానవ హక్కుల కోసం కూడా విస్తృతంగా పోరాడుతున్నారు.

    అలైదా గువేరా ఏడు సంవత్సరాల వయసులో తన తండ్రిని చివరిసారిగా చూశారు. ఆమె 2009 లో క్యూబా లోని వికలాంగ పిల్లల కోసం రెండు వసతి గృహాలను మరియు శరణార్థి పిల్లల కోసం మరో రెండు వసతి గృహాలు నిర్వహించడంలో సహాయం  అందజేశారు.ఆమెకు ఇద్దరు కుమార్తెలు. ఎస్తేపానియా గువేరా మరియు సెలియాలు.  ఎస్తేపానియా గువేరా ప్రొఫెసర్ గాను పని చేస్తున్నారు. అణచివేత, అన్యాయాలను సహించలేని వారికి  చేగువేరా నిత్య స్ఫూర్తిగా నిలుస్తున్నారు అని, ప్రజలు ఒకరికి ఒకరు తమ పట్ల ఉన్న శ్రద్ధను వ్యక్తీకరించడానికి ఒక మార్గం అని వివరించడానికి తన తండ్రి తరచుగా  'సాలిదారిటీ' అనే పదాన్ని ఉపయోగించేవారని అలైదా  గువేరా పేర్కొనడం గమనార్హం.

     "జీవిత పోరాటంలో ఓటమిని అంగీకరించకూడదు అని మా నాన్న నమ్ముతారు. పోరాడి విజయపథం వైపు పయనించాలి. ఎప్పుడూ వెనక్కి తగ్గకండి. మీరు ఎంత ఎత్తు సాధించినా ఎల్లప్పుడూ ప్రజలతో ముఖ్యంగా  మాస్ ప్రజలతో  సత్సంబంధాలు కలిగి ఉండండి. ముఖ్యంగా   శ్రామికవర్గ పోరాటంలో ఐక్యంగా ఉండాలి. ఐక్యమైన ప్రజలు ఎల్లప్పుడూ విజయం సాధిస్తారు" అని అలైదా గువేరా ఉద్భోదించడం కమ్యూనిస్ట్ సమాజ ఆవిర్భావానికి గొప్ప ఉత్తేజాన్ని చేకూరుస్తుంది అని చెప్పక తప్పదు. అలైదా గువేరా  వెనిజులా విప్లవ వేగుచుక్క అయిన హ్యూగో చావెజ్ ని ఇంటర్వ్యూ చేసి 'చావెజ్ - వెనిజులా అండ్ ది న్యూ లాటిన్ అమెరికా' అనే  పుస్తకాన్ని రాశారు. ఆమె అత్యంతంగా అసహ్యసించుకునే మరియు తిరస్కరించే పదం 'జాత్యహంకారం'. 60 సంవత్సరాలకు పైగా నుండి అమెరికా పాలకులు మా జీవితాలను ఆంక్షల పేరుతో కష్టతరం  చేస్తున్ననూ మేము భయపడకుండా ఐక్యంగా ప్రతిఘటిస్తూ ముందుకు సాగుతున్నాము. అదే మా దేశ ప్రజల బలం.  దేశాల మధ్య ఐక్యత ఉండాలి అని, ఎల్లవేళలా క్యూబా కి సంఘీభావం తెలియజేయాలని  అలైదా గువేరా ఇటీవల భారతదేశానికి ఆత్మీయంగా విచ్చేసి పలు సభలలో ఆమె పిలుపు ఇవ్వడం విశేష ప్రాధాన్యతని సంతరించుకుంది. 

    'రక్తపు రుచి మరిగిన అమెరికన్ సామ్రాజ్యవాదం' రోజురోజుకు మరింత వినాశకంగా పరిణమిస్తూ దేశదేశాలను కబలిస్తుంది.  'ప్రపంచ పోలీస్' పాత్రను పోషిస్తున్న అమెరికా చమురు సంపన్న దేశాలతో నియంతృత్వ పోకడలు అనుసరిస్తూ యుద్ధోన్మాదాన్ని కొనసాగిస్తూ చివరికి  తమ దేశానికి అనుకూలంగా ఉన్న వారిని అధికార పీఠాలపై కూర్చోబెట్టి సామ్రాజ్యవాదాన్ని పరాకాష్టగా నిలిచి దుర్నీతికి పాల్పడుతుంది. అందువలన సామ్రాజ్యవాదాన్ని కూకటివేళ్ళతో పెకిలించి సమాధి చేసే దిశగా శ్రామికవర్గ సమసమాజ  స్వాప్నికులు సమరశీల పోరాటాలలో భాగస్వామ్యం కావాల్సిన సమయం  అసన్నమైనది. ఈ తరుణంలోనే చేగువేరా కూతురు అలైదా గువేరా మరియు మనుమరాలు ప్రొఫెసర్ ఎస్తేపానియా గువేరాలు విజయవాడలో  జరుగనున్న క్యూబా సంఘీభావ  సభకు ముఖ్య అతిథులుగా హాజరు కానుండడం 'ఈ నేల సామ్యవాద స్వాప్నికులను సమసమాజ స్థాపన దిశగా రెట్టించిన ఉత్సాహంతో మరింతగా ముందుకు నడిపిస్తుంది' అని ఘంటాపథంగా చెప్పవచ్చు. చేగువేరా ఆదర్శాలను పుణికిపుచ్చుకొని ఆ దిశగా ముందుకు పురోగమిస్తున్న సామ్యవాద స్వాప్నికులు ఈ సందర్భంగా  అలైదా గువేరా మరియు ప్రొఫెసర్ ఎస్తేపానియా గువేరా లకు క్యూబా సంఘీభావ సభ తరపున 'విప్లవ స్వాగతం' పలుకుదాం.

    - జె.జె.సి.పి. బాబూరావు

       రీసెర్చ్ స్కాలర్,

     సెల్: 94933 19690.