న్యూజెర్సీలో తీవ్ర భూకంపం

న్యూజెర్సీలో తీవ్ర భూకంపం
  • ఈ ప్రాంతంలో ఇదే పెద్దది
  •  ప్రత్యక్ష సాక్షి కథనం

భూకంపం ఇంతకు ముందు చాలా సార్లు అనుభవం అయింది నాకు. అయితే ఇవాళ న్యూజెర్సీలో జరిగింది వేరు. నేను రెండో అంతస్తులో నా రూములో కంప్యూటర్ మీద పని చేసుకుంటూ ఉన్నాను. నాకు ఎడమవైపు నుంచి ఏదో విసురుగా, బలంగా వచ్చి గుద్దినట్టు, ఇల్లు మొత్తం కుదిపేసినట్టు అనిపించింది. భూమిలోనుంచి సముద్రపుహోరు లాంటి శబ్దం, ఏవో వస్తువులు గలగలా కదిలినట్టు కూడా శబ్దం. నా గదిలోనే పడుకుని ఉన్న కుక్క పిల్ల బెదిరిపోయి గట్టిగా అరవడం మొదలు పెట్టింది. నాకు ఏమి జరిగిందో అర్ధం కాలేదు. కళ్ళముందున్న వస్తువులేమీ కదిలినట్టు నాకు అనిపించలేదు. అంతా రెండు మూడు సెకండ్లు.  నాకు గతంలో ఒక సారి వర్టిగో అనే తలతిరుగుడు అనుభవం అయింది. బహుశా అదేమో అనుకున్నాను. లేదా ఏదో ఈదురుగాలి అనుకున్నాను. మేము ఉండే ప్రాంతంలో విసిరేసినట్టు అక్కడో ఇల్లు ఇక్కడొకటి ఉంటాయి. ఉధృతంగా గాలులు, గాలి చేసే శబ్దాలు అలవాటే.

కుక్కపిల్ల జున్నుగాడు బాగా బెదిరినట్టు అర్ధమై, సరే, ఏంజరిగిందో చూద్దామని వాడిని చంకలోకి తీసుకొని మెట్లు దిగి కిందకు వచ్చాను. అంతా మామూలుగానే ఉంది. ఇదేదో భ్రమ ఏమో అని మళ్ళీ మెట్లెక్కి పైకి వస్తున్నాను. మరి జున్నుగాడు ఎందుకు భయపడి, ఉలిక్కిపడి అరిచినట్లు? సరే వచ్చి మళ్ళీ కంప్యూటర్లముందు కూర్చున్నాను. వాట్సాప్ లో మెసేజి మా ఆవిడ దగ్గర నుంచి. Did you felt the earthquake (నీకు భూమికంపించడం తెలిసిందా) అని. అవును, అది భూకంపమా? అన్నాను. ఏదో ఈదురుగాలి అనుకున్నానని చెప్పాను.  తను మా ఇంటికి ఓ 15 మైళ్ళ దూరంలో ఆఫీసులో పని చేస్తుంది. మా అమ్మాయి కాలేజిలో పది మైళ్ళ దూరంలో ఉంది. 

“నేను హాస్టలు రూములో ఉన్నాను (ఎనిమిదో అంతస్తు). ఉన్నట్టుండి తలుపులు, మంచం, టేబుల్ అన్నీ ఊగిపోయాయి. నేను, నారూమ్మేటు అమ్మాయి ఇద్దరికీ ఏమీ అర్ధం కాక గది బయటకు వచ్చాము. హాస్టలు బిల్డింగులో ఏదో రిపేరు పనులు చేస్తున్నారేమో అనుకున్నాము. కానీ ఇప్పుడు మీ మెసేజిలు చూశాక మొత్తం అన్ని చోట్లా ఇలా జరిగిందని అర్ధమయింది” అని తను చెప్పింది. వాట్సాప్ లో అప్పటికే రకరకాల గ్రూపుల్లో మెసేజిలు రావడం మొదలయింది. క్షణాల్లో మెసేజిల ఉధృతి పెరిగి వరదలా మారింది. ఇది కాలిఫోర్నియా కాదుకదా ఇక్కడ భూకంపం రావడం ఏమిటని ఒకరు గట్టిగా నిలదీశారు. రెండు రోజుల కిందట తైవానులో వచ్చిన భూకంపానికి ఇది కూతురో మనవరాలో అయి ఉంటుందని ఇంకొకరు సముదాయించారు. నేను కాఫీ కలుపుకుందామనుకునే లోపు అదే కలిపేసుకుందని న్యూయార్కునుంచి అమెరికన్ మితృడొకడు మా టెక్నాలజీ వాట్సాప్ గ్రూపులో చెప్పాడు. దేవుడికి కోపం వచ్చిందని, 2025 నుంచి ఇక అన్నీ అరిష్టాలే అని ఇంకొకరు చెప్పారు. 

గూగుల్లో చూస్తే న్యూజెర్సీ, న్యూయార్క్ ప్రాంతంలో 4.8 తీవ్రతగల భూకంపం వచ్చిందని అమెరికన్ జియొలాజికల్ సర్వే ప్రకటించింది. న్యూజెర్సీలో సాధారణంగా ఐదు ఐదున్నర స్థాయి భూకంపాలను తట్టుకునేలా ఇళ్ళు కడతారని, మనం అంచుదాకా వచ్చామని ఇంకో మితృడు చెప్పారు. నేను డిగ్రీలో జియాలజీ చదివిన విషయం గుర్తుచేసుకున్నాను. దీనికి తైవాను భూకంపానికి సంబంధం ఉండే అవకాశమే లేదని కొద్ది గంటల తర్వాత వచ్చిన వార్తలు తెలియజేశాయి. ఈ రోజు వచ్చిన భూకంపం ఈ ప్రాంతం అంటే 250 కిలోమీటర్ల పరిధిలో అత్యంత తీవ్రమైనదని అమెరికన్ జియొలాజికల్ సర్వే తెలిపింది. 1950 నుంచి ఈ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై మూడు స్థాయికి మించిన భూకంపాలు 40 సార్లు వచ్చాయని, అన్నింటికన్నా ఇదే తీవ్రమైనదని ప్రకటించింది. 

మొదటి భూకంపం తర్వాత సుమారు ఏడున్నర గంటలకు మరోసారి 4 తీవ్రతగల భూకంపం వచ్చింది. వచ్చే వారం రోజుల్లో మరిన్ని సార్లు భూమి కంపించే అవకాశం ఉందని జియొలాజికల్ సర్వే తెలిపింది. నాకొకటి అర్ధమయింది. ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అన్న పాట గుర్తుకొచ్చింది. మన చేతుల్లో ఏమీలేదని మరోసారి తెలిసింది. మనం చేసే పని, మనకు నచ్చిన పని మనం చేస్తూనే పోవాలని అర్ధమయింది. అలాగే ఏం జరిగిందో అర్ధమై, భయం తెలిసేలోగానే హఠాత్తుగా చచ్చిపోవడం అదృష్టమని, స్వర్గమని, భయంతో ప్రాణాలు అరచేత్తోపట్టుకొని గింజుకోవడం నరకమని తెలిసింది.

ఈ భూకంపంపై US Geological Survey సమాచారం ఇక్కడ: 
https://earthquake.usgs.gov/earthquakes/eventpage/us7000ma74/executive

రచయిత కె వి ఎన్ ఎం ప్రసాద్

(రచయిత కె వి ఎన్ ఎం ప్రసాద్ ఆంధ్రప్రభలో 1990 నుంచి 2000 వరకూ సబ్ ఎడిటర్ గా పనిచేశారు. కంప్యూటర్ పై తెలుగులో మొదటి పుస్తకం 1992లో రాశారు. 2001 నుంచి ప్రసాద్ కూనిశెట్టిగా న్యూజెర్సీలో ఉంటున్నారు.)