Tea controversy: రెండు దేశాల మధ్య గొడవకు దారితీసిన ‘టీ రెసిపీ’

Tea controversy: రెండు దేశాల మధ్య గొడవకు దారితీసిన ‘టీ రెసిపీ’
  • టీ లో చిటికెడు ఉప్పు వేయాలంటూ అమెరికా ప్రొఫెసర్ సూచన
  • అనేక పరిశోధనల తర్వాత ‘స్టీప్డ్‌: ది కెమిస్ట్రీ ఆఫ్‌ టీ’ పేరుతో పుస్తకం
  • యూకేలో విడుదలైన ఈ బుక్ పై తీవ్ర వ్యతిరేకత
  • అమెరికా ఎంబసీ వివరణ ఇచ్చుకునేంత వరకు వెళ్లిన వివాదం

టీ ఎలా తయారు చేయాలో చెబుతూ ఓ ప్రొఫెసర్ చేసిన సూచన ఏకంగా రెండు అగ్ర దేశాల మధ్య వివాదానికి కారణమైంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో ఎంబసీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ వివరణపైనా మరో దేశం సవరణ ప్రకటన వెలువరించడం ఈ వివాదానికి కొసమెరుపు. ఇంతకీ ఏంజరిగిందంటే.. అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ మిషెల్ ఫ్రాన్సిల్ ఇటీవల ఓ పుస్తకం రాశారు. తనకెంతో ఇష్టమైన టీ పైనే పరిశోధనలు చేసి, తయారీ విధానానికి సంబంధించిన పరిశోధనాత్మక ప్రతులు చదివి ‘స్టీప్డ్‌: ది కెమిస్ట్రీ ఆఫ్‌ టీ’ పేరుతో పుస్తకం రాశారు.

ఇటీవలే ఈ పుస్తకం యూకేలో విడుదలైంది. అయితే, ఈ పుస్తకంపై యూకే వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యూకే జాతీయ పానీయం టీ.. అలాంటి టీకి సంబంధించిన తయారీ విధానంపై ప్రొఫెసర్ మిషెల్ చేసిన సూచన యూకే వాసులకు నచ్చలేదు. దీంతో మిషెల్ పుస్తకంపై, అందులో ఆమె చేసిన సూచనపై మండిపడుతున్నారు. ఈ విషయంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో యూకేలోని అమెరికా ఎంబసీ కూడా కలగజేసుకుంది. ఈ గొడవ ముదిరే సూచనలు కనిపించడంతో వివరణ ఇచ్చుకుంది. 

తమ దేశానికి చెందిన ప్రొఫెసర్ చేసిన సూచన ఇరు దేశాల మధ్య ఉన్న బంధాన్ని ఇరకాటంలోకి నెట్టిందని పేర్కొంది. టీలో ఉప్పు కలపడం తమ దేశ అధికారిక విధానం కాదని, ఇక ముందు కూడా కాబోదని అమెరికా ఎంబసీ తన వివరణలో స్పష్టం చేసింది. అంతటితో ఆగకుండా టీని ఎల్లప్పుడూ మైక్రోవేవ్ ఆవెన్ లో తయారు చేస్తారంటూ తన వివరణలో పేర్కొంది. టీ తయారీ విధానంపై అమెరికన్ ఎంబసీ చేసిన వ్యాఖ్యలు మరో చర్చకు దారితీయడంతో బ్రిటన్ ప్రభుత్వం స్పందించింది. టీ ని ఆవెన్ లో కాదు కెటిల్ లో తయారు చేస్తారని, కెటిల్ లోనే తయారు చేయాలని ట్వీట్ చేసింది.

డాక్టర్ మిషెల్ సూచన ఏంటంటే..
టీ చక్కగా కుదరాలంటే, రుచిగా ఉండాలంటే అందులో చిటికెడు ఉప్పు వేయాలని ప్రొఫెసర్ మిషెల్ సూచించారు. తన పుస్తకంలో పేర్కొన్న టీ రెసిపీలో ఉప్పును కలిపే విషయాన్ని ప్రస్తావించారు. టీ ని ఎంతగానో ఇష్టపడే తాను స్వయంగా పరిశోధించి మరీ ఈ విషయాన్ని కనుగొన్నట్లు మిషెల్ చెప్పారు. అయితే, టీ లో ఉప్పు కలపాలన్న సూచన యూకే వాసులకు రుచించలేదు. దీంతో ప్రొఫెసర్ మిషెల్ పై, ఆమె రాసిన పుస్తకంపై ఆన్ లైన్ లో విమర్శలు గుప్పించారు.