కాలిఫోర్నియాలో భారీగా మంచు

కాలిఫోర్నియాలో భారీగా మంచు

అమెరికాలోని టెక్సాస్  లూసియానా రాష్ట్రాలను తీవ్రమైన తుపాను తాకడంతో కాలిఫోర్నియాలో భారీగా మంచు కురుస్తోంది.  ఫలితంగా చాలా చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో వేలాది గృహాలు చీకట్లో ఉన్నాయి. డాలస్‌కు రాకపోకలు సాగించే వందల కొద్దీ విమానాలు రద్దయ్యాయి. డాలస్‌ను టోర్నడో తాకే ముప్పు ఉందని హెచ్చరికలు జారీ చేశారు. టెక్సాస్‌ రాష్ట్రంలో దాదాపు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని జాతీయ వాతావరణ సేవల సంస్థ వెల్లడించింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించింది. డాలస్‌ సమీపంలో తీవ్రమైన గాలులు వీచాయని పేర్కొంది. ఉత్తర డాలస్‌ ప్రాంతంలో భారీ వృక్షాలు కూలిపోగా.. యూఎస్‌ రూట్‌ 75లో 18 చక్రాల వాహనాలు కూడా బోల్తాపడ్డాయి.

డాలస్‌లోని ఫోర్ట్‌వర్త్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు 400 విమాన సర్వీసులు రద్దయ్యాయి. లూసియానాలోని షెర్వ్‌ పోర్టు సమీపంలో లూసియానా స్టేట్‌ యూనివర్శిటీని టోర్నడో తాకింది. మరోవైపు టెక్సాస్‌లో 3,46,000 ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఈ తుపాను కారణంగా కాలిఫోర్నియాలో దాదాపు 7 అడుగుల మేర హిమపాతం సంభవించింది. ఈ స్థాయి మంచు.. తరానికి ఒక్కసారి మాత్రమే చూడగమలని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో కొన్నాళ్ల నుంచి నెలకొన్న కరవు పరిస్థితులు ఈ తుపాను దెబ్బకు కొంత తగ్గే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.