అదే జరిగితే ట్రంప్‌ మళ్లీ గెలవడం ఖాయం.. మస్క్‌ జోస్యం

అదే జరిగితే ట్రంప్‌ మళ్లీ గెలవడం ఖాయం.. మస్క్‌ జోస్యం

వాషింగ్టన్‌: తనని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఒకవేళ అదే జరిగితే 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ నెల 21న తనను అరెస్టు చేసే అవ కాశాలున్నాయని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ అనుమానం వ్యక్తంచేశారు. తనతో లైంగిక సంబంధాలున్నాయని ఆరోపించిన మహిళను డబ్బులతో ప్రలోభపెట్టినట్లు వచ్చిన అభియోగాల కేసులో తనని అదుపులోకి తీసుకోవచ్చని తెలిపారు.

'ట్రూత్‌ సోషల్‌' నెట్‌వర్క్‌లో ఈ మేరకు ఆయన శనివారం పోస్ట్‌ చేశారు. మాన్హాటన్‌ డిస్ట్రిక్ట్‌ అటార్నీ కార్యాలయం నుంచి అనధికారికంగా తనకు సమాచారం అందినట్లు వెల్లడించారు. గతసారి అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాన్ని జో బైడెన్‌ దొంగిలించుకుపోయారని మరోసారి ఆరోపించారు. దేశాన్ని మళ్లీ మునుపటి స్థితికి చేర్చేందుకు నిరసనలు తెలపాలని అనుచరులకు విజ్ఞప్తిచేశారు. లైంగిక సంబంధాల ఆరోపణల్ని ట్రంప్‌ ఇదివరకే తోసిపుచ్చారు.