మిచి‘గన్​’​ యూనివర్సిటీలో కాల్పులు

మిచి‘గన్​’​ యూనివర్సిటీలో కాల్పులు
Gun Shooting at University of Michigan
  • ఐదుగురు మృతి.. పలువురికి గాయాలు..
  • దుండగుడు ఆత్మహత్య

న్యూఢిల్లీ: అమెరికా మిచిగాన్​ యూనివర్సిటీలో కాల్పుల మోత మోగింది. ఈ కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు. కాల్పులు జరిపిన దుండగుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. యూనివర్సిటీలోకి తుపాకీతో లోపలికి ప్రవేశించిన నిందితుడు.. రెండు చోట్ల కాల్పులు జరిపాడు. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే నిందితుడు తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 50వేల మంది విద్యార్థులు చదువుకుంటున్న ఈ విశ్వవిద్యాలయంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఘటనతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల శబ్దం విన్న మిగతా విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురై గదుల్లోకి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు.

కాల్పుల అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు యూనివర్సిటీ సిబ్బంది తెలిపారు. అయితే, ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే నిందితుడు తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందినట్టు యూనివర్సిటీ పోలీస్ విభాగం డిప్యూటీ చీఫ్ క్రిస్ రోజ్‌మన్  అన్నారు. అకడమిక్ బిల్డింగ్ బెర్కే హాల్, యూనివర్సిటీ యూనియన్ బిల్డింగ్ వద్ద రెండు చోట్ల ఆగంతకుడు కాల్పులు జరిపాడని తెలిపారు. ఈ ఘటనలో మరో ఐదుగురు గాయపడ్డారని, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. వీరికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. బెర్కే హాల్ వద్ద ఇద్దరు, యూనియన్ బిల్డింగ్ వద్ద ఒకరు చనిపోయారని వివరించారు.

ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారని, కాల్పులకు కారణం ఇంకా తెలియరాలేదని రోజ్‌మన్ అన్నారు. ఇంతకు ముందు యూనివర్సీటిలో ఇలాంటి ఘటనలు జరగలేదని పేర్కొన్నారు. అనుమానిత నిందితుడు కాల్పుల జరిపిన నాలుగు గంటల తర్వాత ఆత్మహత్యకు పాల్పడినట్టు నిర్ధారించారు. అమెరికాలో అతిపెద్ద ఉన్నత విద్యాసంస్థల్లో మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ ఒకటి. కాల్పులు జరిగిన ఈస్ట్‌ లాన్సింగ్‌ క్యాంపస్‌లో 50వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తాజా ఘటన నేపథ్యంలో 48 గంటల పాటు క్యాంపస్‌లో అన్ని తరగతులు, ఇతర కార్యకలాపాలను రద్దు చేసినట్లు యూనివర్సిటీ పోలీసులు వెల్లడించారు.