బైడెన్‌కు క్యాన్సర్ కణజాలం తొలగింపు

బైడెన్‌కు క్యాన్సర్ కణజాలం తొలగింపు
Biden to have cancerous tissue removed

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చర్మ క్యాన్సర్ సంబంధిత చికిత్స జరిగింది. బైడెన్ ఛాతిపై గాయం రూపంలో ఉన్న క్యాన్సర్ కణజాలాన్ని వైద్యులు విజయవంతంగా తొలగించారు. ఫిబ్రవరిలో ఈ చికిత్స చేసినట్లు వెల్లడించారు. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా ఛాతి చర్మం మీద ఓ కణతిని వైద్యులు గుర్తించారు. దానికి శరీర ఇతర భాగాలకు వ్యాపించే లక్షణం లేనప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యగా వైద్యులు తొలగించారు. దీని గురించి బైడెన్‌ వ్యక్తిగత వైద్యుడు కెవిన్‌ ఓ కొనార్‌ ఇచ్చిన నివేదిక వివరాలను శ్వేతసౌధం వెల్లడించింది.

అలాగే ఇకపై దీనికి సంబంధించి ఆయనకు ఎలాంటి చికిత్స అవసరం లేదని తెలిపింది.  బైడెన్‌కు వార్షిక సాధారణ వైద్యపరీక్షలను ఫిబ్రవరి 16న నిర్వహించారు. ఇందులో ఆయన ఫిట్‌గా ఉన్నట్లు వైద్యులు అప్పట్లో వెల్లడించారు. 'బైడెన్ ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన విధులను నిర్వర్తించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు' అని వైద్య పరీక్షల అనంతరం తెలిపారు. ఇదిలా ఉంటే.. మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు బైడెన్‌ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు ఆయన సతీమణి జిల్‌ ఇటీవల ఓ ప్రకటన చేశారు. ఆయన బరిలో ఉంటారని చెప్పారు. ఒకవేళ ఆయన మళ్లీ అధ్యక్ష ఎన్నికలకు దిగితే.. ఈ వైద్య పరీక్షలనే పరిగణనలోకి తీసుకోనున్నారు.