పెట్టుబడులతో మా రాష్ట్రానికి రండి 

పెట్టుబడులతో మా రాష్ట్రానికి రండి 
  • ప్రపంచ ఆర్ధిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం
  • పలువురు విదేశీ ఇన్వెస్టర్లతో  మంతనాలు
  • రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు సాధించే విధంగా నిర్ణయాలు
  • ఫిబ్రవరి 28న బయో ఏషియా సదస్సులో హైదరాబాద్​లో దావోస్​లో ప్రత్యేక ఆకర్షణగా ’ఇన్ వెస్ట్ ఇన్​ తెలంగాణ’ పెవిలియన్ 

‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విశాల దృక్పథం, నిర్దేశించుకున్న లక్ష్యాలన్నీ తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయి. అందుకే రెండింటి మధ్య అద్భుతమైన సమన్వయం కుదిరింది. జీవన విధానాలు, జీవన నాణ్యత ప్రమాణాలు మెరుగుపరిస్తే ప్రజల జీవితాలు బాగుపడుతాయనే ఆలోచనల సారూప్యతకు కట్టుబడి ఉన్నాం. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రపంచ స్థాయిలో పని చేస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలపై దృష్టి కేంద్రీకరిస్తోంది. ఇరువురి భాగస్వామ్యంతో ప్రజల ఆరోగ్యం, సాంకేతికత, మంచి జీవితం అందించాలనే లక్ష్యాలను వేగంగా అందుకోవచ్చు..’ అని సీఎం రేవంత్​రెడ్డి  అన్నారు. ‘ప్రపంచ స్థాయిలో ఆరోగ్య సంరక్షణ విధానాలను సరికొత్తగా పునర్నిర్వించే ఆలోచనలున్నాయి. చిన్న పట్టణాలు, గ్రామాలకు ఈ సేవలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది..’ అని సీఎం అన్నారు.  

ముద్ర, తెలంగాణ బ్యూరో: ఇన్వెస్ట్ ఇన్‌ తెలంగాణ పేరుతో చేపట్టిన క్యాంపెయిన్‌ను ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా ప్రారంభించింది. సోమవారం దావోస్‌ చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారుల బృందం విదేశాలకు చెందిన పలువురు ఇన్వెస్టర్లతో సమావేశమయ్యారు.  ఒకవైపు పరిశ్రమల స్థాపనకు రావాల్సిందిగా  ఆహ్వానించడంతో పాటు తెలంగాణలో పెట్టుబడులను పెట్టాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి వారికి విజ్ఞప్తి చేశారు.  ఐటీ, జీవ వైద్య శాస్త్ర రంగానికి ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందిన తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు, భారీ పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంతో తెలంగాణ ప్రతినిధి బృందం తొలి రోజునే పలువురు ప్రముఖులతో కీలక చర్చలు జరిపింది.   కాగా ఈ సమ్మిట్‌లో పాల్గొనడానికి వెళ్ళిన తెలంగాణ బృందానికి సీఎం రేవంత్ నాయకత్వం వహిస్తున్నారు. ఫోరమ్ ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతో ప్రత్యేకంగా సమావేశమైన రేవంత్.. ప్రస్తుతం తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం, పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు, ప్రోత్సాహకాలు, అనువైన పరిస్థితుల గురించి కూలంకషంగా వివరించారు. 

ప్రధానంగా ఇథియోఫియా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెమెక్ హసెంటోతో సమావేశమయ్యారు. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న రూట్​ మ్యాప్​పై ఆయనతో చర్చించారు. అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫ్రెసిడెంట్‌ బోర్గోబ్రెండేతో కూడా రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. స్విట్జర్లాండ్‌లోని జూరిచ్ విమానాశ్రయంలోనే ప్రవాసీ తెలంగాణ ప్రముఖులతో రేవంత్ టీం చర్చలు జరిపింది. సమ్మిళిత, సంతులిత అభివృద్ధి ద్వారా ప్రజలందరి పురోగతి కోసం నవ తెలంగాణ నిర్మాణంలో భాగమయ్యేందుకు వారంతా మొగ్గు చూపాలని కోరారు. ప్రభుత్వాలతో పాటు పారిశ్రామికవేత్తలు, వ్యాపార, వాణిజ్య వాటాదారులు కలిసికట్టుగా పనిచేస్తే ప్రజలు సంపన్నులయ్యే అవకాశాలు నెలకొంటాయని, సుస్థిరమైన అభివృద్ధితో పాటు జీవన ప్రమాణాలు మెరుగుపడితే  ప్రజలు మరింత ఆర్థికంగా నిలదొక్కుకుంటారనే అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వివిధ రంగాలకు చెందిన పారిశ్రామివేత్తలకు ఉన్న అవకాశాలపై వివరించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యతలను సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు.

అనంతరం  సీఎం రేవంత్​ రెడ్డి, మంత్రి శ్రీధర్​ బాబుల బృందం నేషనల్ అసోషియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ ( నాస్కాం) ప్రెసిడెంట్  దేబ్జానీ ఘోష్​తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో స్కిల్ డెవెలప్​మెంట్​ పై ప్రత్యేక దృష్టి సారించటం,  అందుకోసం అనుసరించే భవిష్యత్తు మార్గాలపై చర్చించారు. ఇంజినీరింగ్, డిగ్రీ కోర్సులు చదువుతున్నయువతకు స్కిల్ డెవెలప్మెంట్, ప్లేస్​మెంట్​  కమిట్మెంట్, విలువైన ఉద్యోగాల కల్పనకు సాయం అందించే అంశాలపై సంప్రదింపులు జరిపారు.  రాష్ట్రంలో ప్రతీ జిల్లాలో స్కిల్ డెవలప్‌మెంట్ వర్సిటీ నెలకొల్పాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుని ఒక నోడల్ ఆఫీస్‌గా ప్రజాభవన్ ప్రాంగణంలోనే కోఆర్డినేషన్ పెడుతున్నట్లు సీఎం  తెలిపారు.  ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ కేర్, లైఫ్ సైన్స్ రంగాల్లో ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్‌గా మారుతున్న పరిస్థితుల్లో పలు విదేశీ కంపెనీలను తెలంగాణకు రప్పించడం, ఇక్కడి యువతకు చదువుతో పాటు ఉపాధికి దారితీసే అంశాల్లో శిక్షణ కల్పించనున్నామని  వివరించారు. ప్రపంచ వేదికపై  ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ పెవిలియన్ దావోస్​లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ పెవిలియన్​ కొనసాగుతోంది.  వేర్​ ట్రెడిషన్​ మీట్స్​ ఇన్నోవేషన్​ ట్యాగ్​ లైన్​తో ఈ ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. 

 తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాన్ని చాటేలా రూపొందించిన  ఈ వేదిక అందరినీ ఆకర్షిస్తోంది.  బతుకమ్మ, బోనాల పండుగలు,  మన చారిత్రక వారసత్వ సంపదకు చిహ్నంగా నిలిచిన చార్మినార్​...  మన కళాకారుల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన చేర్యాల పెయింటింగ్​, పోచంపల్లి ఇక్కత్​, ఐటీ, సాంకేతిక ఆవిష్కరణల కొత్త సౌధం టీ హబ్​.. స్కైరూట్ ఏరోస్పేస్..  విభిన్న రంగాల మేళవింపు ఉట్టిపడేలా తయారు చేసిన వాల్​ డిజైనింగ్​ ఈ పెవిలియన్​కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు ప్రపంచానికి చాటిచెప్పటంతో పాటు.. ’ఇన్ వెస్ట్ ఇన్​ తెలంగాణ’ పేరుతో ముస్తాబు చేసిన ఈ పెవిలియన్ అందరినీ ఆకట్టుకుంటోంది.  ప్రపంచంలోనే అపారమైన అవకాశాలున్న తెలంగాణ’, పెట్టుబడులకు దేశంలోనే మొట్టమొదటి  గమ్యస్థానం తెలంగాణ’ అనే నినాదాలు​  పెవిలియన్​కు స్వాగతం పలుకుతున్నాయి. భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు.. మీ కోసమే తెలంగాణ అంటూ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి హోర్డింగ్​ ప్రపంచ దిగ్గజ కంపెనీలను ఆకట్టుకునేలా ఉంది. సంప్రదాయ మేళవింపుతో ఆవిష్కరణలు.. జీవ వైద్య రంగానికి  డేటా సైన్స్​ జోడీ..ప్రతిభను ప్రతిబింబించే సాంకేతికత.. పరిశ్రమల నుంచి సమగ్రత.. స్థిరత్వం నుంచి ఆర్థిక వృద్ధి సిద్ధిస్తుందనే తెలంగాణకున్న అనుకూలతలన్నింటినీ దీనిపై ఇంగ్లిష్​ కోట్స్​తో ప్రదర్శించారు. 

వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్వర్యలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ (సి4ఐఆర్) హైదరాబాద్​లో ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరింది. బయో ఏషియా–2024 సదస్సులో భాగంగా వచ్చే నెల ( ఫిబ్రవరి) 28న ఈ సెంటర్ ప్రారంభం కానుంది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి సారధ్యంలో రాష్ట్ర ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచే (స్టేట్ హెల్త్ టెక్ ల్యాండ్ స్కేప్) సాంకేతిక ఆధారిత కార్యక్రమం రూపుదిద్దుకుంటుంది. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరిపింది. అనంతరం సంయుక్తంగా ఈ ప్రకటన చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో టెక్నాలజీ కలయికతో అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తెలంగాణకు విశిష్ట సహకారం అందించింది.