వరుసగా రెండోరోజూ లాభాలు.. 60,000 ఎగువన ముగిసిన సెన్సెక్స్‌

వరుసగా రెండోరోజూ లాభాలు.. 60,000 ఎగువన ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌  సూచీలు వరుసగా రెండోరోజూ లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు సూచీలకు దన్నుగా నిలిచాయి.  ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ వంటి దిగ్గజ షేర్లు రాణించడం సూచీలకు కలిసొచ్చింది. ఫిబ్రవరి వాహన విక్రయాల్లో గణనీయ వృద్ధి నమోదు కావడం కూడా సెంటిమెంటును బలపర్చింది. ఉదయం సెన్సెక్స్‌ 60,007.04 దగ్గర భారీ లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 60,498.48 దగ్గర గరిష్ఠానికి చేరింది. చివరకు 456.88 పాయింట్ల లాభంతో 60,265.85 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 17,680.35 దగ్గర ప్రారంభమై 17,799.95 దగ్గర రోజులో అత్యంత ఎగువ స్థాయిని తాకింది.

చివరకు 124.65 పాయింట్లు లాభపడి 17,719.00 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.91 దగ్గర నిలిచింది. సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో టాటా మోటార్స్‌, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇన్ఫోసిస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌, టీసీఎస్‌, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ షేర్లు నష్టపోయాయి.