మహిళలు ఆర్థికంగా ఎదగాలి

మహిళలు ఆర్థికంగా ఎదగాలి
  • పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ముద్ర ప్రతినిధి, జనగామ: మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుందని.. కుటుంబాలు బాగుంటే గ్రామం, రాష్ట్రం, దేశం బాగుంటుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణలో మొదటి విడత ట్రైనింగ్ పూర్తి చేసుకున్న మహిళలకు సోమవారం మిషన్ల పంపిణీ చేశారు. దేవరుప్పుల, కొడకండ్లల్లో వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మహిళలు అనాదిగా పడుతున్న ఇబ్బందులు తాను కళ్లారా చూశానని, అందుకే వారి ఉపాధి కల్పనపై దృష్టి సారించినట్లు చెప్పారు.  

అందులో భాగంగానే కుట్టు శిక్షణ కేంద్రాల ఏర్పాటు చేయడంతో పాటు కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమాన్ని పట్టినట్లు తెలిపారు. రూ.5.10 కోట్లతో పాలకుర్తిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగడం సంతోషంగా ఉందన్నారు. మొత్తం 10 వేల మందికి శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రోగ్రాంలో మొదటి విడతగా 3వేల మందికి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం వెయ్యి మంది శిక్షణ పూర్తయిందని తెలిపారు. వీరికి జూలై నుంచి వరంగల్ టెక్స్ టైల్ పార్క్ లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ శివ లింగయ్య, ఆర్డీవో కృష్ణవేణి, డీఆర్డీఓ పీడీ రామ్ రెడ్డి, ఏపీడీ నూరొద్దీన్, డీపీఎంలు, సీసీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు పాల్గొన్నారు.