రిజెక్టెడ్!

రిజెక్టెడ్!
  • కేబినెట్​ప్రతిపాదించిన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించిన గవర్నర్​
  • దాసోజు, కుర్రా సత్యనారాయణ సామాజ సేవ చేయలేదన్న తమిళిసై
  • ఎమ్మెల్సీ అర్హతలు లేవంటూ ప్రభుత్వానికి లేఖ
  • వారం కిందటే తిరస్కరణ.. నియామకంపై వాగ్వాదాలు
  • ఎమ్మెల్సీ ఎంపికలో కాషాయం మార్క్?
  • గవర్నర్ బీజేపీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారన్న మంత్రులు
  • నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న కిషన్​రెడ్డి
  • సోషల్ సర్వీసులో ఉన్నాం : దాసోజు శ్రవణ్​


గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం రాజకీయ రంగు పులుముకుంది. కేబినెట్​ఆమోదించి, తీర్మానం చేసి పంపించిన పలు కీలక బిల్లులకు గవర్నర్ దగ్గర బ్రేక్​ పడటం ఇటీవల నిత్యకృత్యమైంది. తాజాగా కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎంపిక చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను గవర్నర్​తమిళిసై తిరస్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులిద్దరూ ఎక్కడా సామాజిక సేవా కార్యక్రమాలు, సేవా విభాగాల్లో పాల్గొన్నట్లు కనిపించలేదని లేఖ ద్వారా తెలియజేశారు. రాజకీయ నాయకులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయొద్దని రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) చెబుతోందని, దీని ప్రకారమే ఈ ఫైల్​ను ఆమోదించలేదని గవర్నర్​వెల్లడించారు. 

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎంపిక చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను గవర్నర్​తమిళిసై తిరస్కరించడం హాట్​టాపిక్​గా మారింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయటానికి అర్హతలు అడ్డొస్తున్నాయంటూ ఈనెల 19వ తేదీన గవర్నర్ ప్రభుత్వానికి లేఖ పంపారు. అయితే కేవలం బ్రీఫ్ ప్రొఫైల్​మినహా.. ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వలేదని రాజ్​భవన్​వర్గాలు వెల్లడించాయి. బయోడేటా మినహా అర్హతలకు సంబంధించిన పత్రాలు పంపలేదని, రాజకీయ నేతలకు ఈ పదవి ఇవ్వడం కుదరని ఫైల్​ను తిరస్కరిస్తున్నట్లు లేఖలో ప్రస్తావించారు. 

రెండుసార్లు ఇదే తంటా!

గతంలో పాడి కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ విషయంలో కూడా కేసీఆర్ ప్రభుత్వానికి రాజ్​భవన్​లో ఎదురుదెబ్బ తగిలింది. కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించి గవర్నర్‌కు పంపించింది. అప్పుడు కూడా కౌశిక్‌రెడ్డి ఎక్కడా సేవా కార్యక్రమాలు చేసినట్లు కనిపించలేదని తిరస్కరించారు. అంతేకాకుండా ఆయనపై కేసులు ఉన్నాయంటూ తిరకాసు పెట్టారు. తాజాగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణకు కూడా ఇలాంది కారణాన్నే చూపించారు. గతంలోనూ ప్రభుత్వం పంపిన కీలక బిల్లులకు గవర్నర్​అనుమతి ఇవ్వలేదు. ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం విలీనం చేసే ఫైల్​కూడా రాద్ధాంతమైంది. దీనిపై నేతలు, కార్మికులు నిరసనలు, రాజ్​భవన్ ముట్టడిదాకా వెళ్లారు. ఎట్టకేలకు ఈ ఫైల్​కు ఆమోదం చెప్పడంతో.. త్వరలోనే ఎమ్మెల్సీల నియామకానికి కూడా ఆమోదం వస్తుందని భావించారు. ఇటీవల పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా రాజ్‌భవన్‌కు సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులంతా వచ్చారు. ఆ సమయంలో తమిళిసైతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అనంతరం నూతన సచివాలయాన్ని సందర్శించి అక్కడే నిర్మించిన చర్చి, గుడి, మసీదులను ప్రారంభించారు. పలు సమావేశాల్లో కూడా సీఎం కేసీఆర్‌ను తమిళిసై పొగడ్తలతో ముంచెత్తారు. ఈ పరిణామాలతో ప్రభుత్వం -రాజ్‌భవన్ మధ్య చోటుచేసుకున్న గ్యాప్ తొలగిపోయిందని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే సడెన్​గా గవర్నర్ కోటా అభ్యర్థులను తమిళిసై తిరస్కరించడంతో.. రాజ్​భవన్, ప్రగతి భవన్​ మధ్య మళ్లీ దూరం పెరిగినట్లయ్యింది.

రాజకీయ వివాదాలు..

తెలంగాణ గవర్నర్ గా తమిళిసై నియామకం నుంచే విభేదాలు బహిర్గతమవుతున్నాయి. కౌశిక్​రెడ్డి ఫైల్​ తిరస్కరించడంతో వివాదాలు మరింత ముదిరాయి. చివరికి కేసీఆర్‌ సర్కార్‌ కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చేయాలనే ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు. అప్పటి నుంచి గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య తలెత్తిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఆ తర్వాత గతంలో వరద ముంపు ప్రాంతాలను సందర్శించడానికి వెళ్లినప్పుడు అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బడ్జెట్‌ను గవర్నర్ ఆమోదించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ పంపిన బిల్లు డ్రాఫ్ట్‌ను ఆమోదించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య హైడ్రామా చేటు చేసుకుంది. దీంతో గవర్నర్‌ను అడ్డుపెట్టుకుని కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని రాష్ట్ర ప్రభుత్వం విమర్శిస్తోంది.

ఆచితూచీ పంపించినా..!

సాధారణంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫారసు చేయాలంటే వివిధ రంగాల్లో పేరు ప్రతిష్టలు పొందిన వారిని,  మేధావులను సిఫారసు చేయాలనే సంప్రదాయం ఉంది. పాడి కౌశిక్ రెడ్డిపై కేసులున్నాయన్న కారణంగా గవర్నర్ తిరస్కరించారు. కానీ ఇప్పుడు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ఎంపిక చేశారు. నిజానికి శ్రవణ్​ గతంలో దాసోజు ఫౌండేషన్​పేరుతో స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించారు. ఈ సంస్థ ఇంకా కొనసాగుతున్నది. అలాగే సంగారెడ్డికి చెందిన కుర్రా సత్యనారాయణ జనతాపార్టీ, బీజేపీలో పనిచేశారు. 1999లో టీడీపీ–-బీజేపీ పొత్తులో భాగంగా సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, 2018 వరకు బీజేపీలోనే ఉన్నారు. ఆయన ఎస్టీ వర్గానికి చెందిన నేత. కేవలం వీరిద్దరు రాజకీయాల్లో ఉన్నారనే  కారణంతోనే వారి పేర్లను ఆమోదించలేదని గవర్నర్ పేర్కొన్నారు. కాగా ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాన్ని గవర్నర్​ తిరస్కరించిన వెంటనే బీజేపీ స్టేట్​చీఫ్​కిషన్​రెడ్డి స్పందించారు. మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు, ప్రజాసేవ చేసే వారికి మాత్రమే గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీలు ఇస్తారని అన్నారు. కేసీఆర్ కుటుంబానికి సేవ చేసే వారికి ఈ పోస్టుకు ఎలా నామినేట్ చేస్తారని ప్రశ్నించారు.

గవర్నర్​కాదు.. బీజేపీ ప్రతినిధి : మంత్రులు

గ‌వ‌ర్నర్ త‌మిళిసై తీరుపై మంత్రులు హరీశ్​రావు, ప్రశాంత్​రెడ్డి, ఇంద్రకరణ్​రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ‌వ‌ర్నర్‌లా కాకుండా బీజేపీ ప్రతినిధిలా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. కేబినెట్ ఆమోదించిన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల‌ను గ‌వ‌ర్నర్ ఎలా తిరస్కరిస్తారని ప్రశ్నించారు. సుబ్రహ్మణ్య స్వామిని రాజ్యస‌భ‌కు ఎలా నామినేట్ చేశారో గ‌వ‌ర్నర్ చెప్పాల‌ని మంత్రులు డిమాండ్​చేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉండి గవర్నర్​గా నామినేట్​అయ్యారని, గవర్నర్​గా తమిళి సైని నియమించడం కూడా సర్కారియా కమిషన్​కు విరుద్ధమని మంత్రులు తెలిపారు. కాగా గవర్నర్ తమిళిసై నిర్ణయంపై దాసోజు శ్రవణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ వర్క్ రాజకీయాలు.. విభిన్నమైన పాత్రలు, ప్రయోజనాలను కలిగి ఉంటాయని, కానీ అవి పరస్పర విరుద్ధమైనవి కావని అన్నారు.