కలహాల ‘గ్యారంటీ’

కలహాల ‘గ్యారంటీ’
  • తీరు మారని టీ కాంగ్రెస్ సీనియర్లు
  • ఏఐసీసీ మందలింపులు కూడా బేఖాతరు
  • కమిటీలలో చోటు కల్పించినా అసంతృప్తి
  • గాంధీభవన్ వేదికగా వెలుగులోకి విభేదాలు
  • ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం నాయకుల మధ్య పోటీ
  • సీడబ్ల్యూసీ, విజయభేరీ సభలో అగ్రనేతలు సీరియస్ 
  • హుటాహుటినా ఢిల్లీకి రేవంత్, ఉత్తమ్, భట్టి
  • పత్తాలేని బస్సుయాత్ర, సెల్ఫీ విత్ డెవలప్ మెంట్​
  • మీడియాకే పరిమితమవుతున్న నేతల ప్రకటనలు 

ముద్ర, తెలంగాణ బ్యూరో :తెలంగాణలో ‘హస్తం’ పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతోంది. ఏఐసీసీ రంగంలో దిగినా టీ కాంగ్రెస్​ సీనియర్ల మధ్య సమన్వయం కుదురడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్నా ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్న చందంగానే వ్యవహరిస్తున్నారు. దీంతో అధిష్టానం వారి మీద గుర్రుగా ఉంది. హైదరాబాద్​ కేంద్రంగా ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మక కాంగ్రెస్​ వర్కింగ్​కమిటీ సమావేశాలలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీనియర్లను తీవ్రంగా మందలించిన విషయం తెలిసిందే. కలిసి పని చేయాలని పదే పదే ఆదేశిస్తున్నా మార్పు రాని నేతలపై ఖర్గే అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నెల 17న తుక్కుగూడలో జరిగిన విజయభేరీ సభకు హాజరైన సోనియాగాంధీ ఆరు నిమిషాలు మాత్రమే ఉండి వెనుదిరగడం హాట్ టాపిక్ గా మారింది. రెండు రోజుల పాటు హైదరాబాదులో ఉండి సీనియర్ల పనితీరుపై ఆరా తీసిన సోనియాగాంధీ వారిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఏఐసీసీ అగ్రనేతల రాష్ట్ర పర్యటన ముగిసిన వెంటనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హుటాహుటిన హస్తీనాబాట పట్టడం రాజకీయ చర్చకు దారితీసింది. తెలంగాణలో సీనియర్ల మధ్య నెలకొన్న అంతర్గత పోరుపై సోనియాకు వివరణ ఇచ్చేందుకే వారు ఢిల్లీకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. స్క్రీనింగ్​ కమిటీ సమావేశాలలోనూ వారు పాల్గొన్నారు. 

అక్కడా ఆధిపత్య పోరే!

మొన్నటి వరకు పార్టీలో ప్రాధాన్యం కోసం పట్టుబట్టి కమిటీలలో చోటు దక్కించుకున్న నేతలు కమిటీ సమావేశాలలోనూ ఆధిపత్య పోరుకు తెరలేపారు. ఓ వైపు ఏఐసీసీ తెలంగాణలో అధికారం కోసం వ్యూహాలు రచిస్తుంటే, మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్​ రెడ్డి వర్గానికి, ఆయనకు వ్యతిరేక వర్గానికి మధ్య విభేదాలు తారస్ధాయికి చేరడం అధిష్టానానికి కలవరం కలిగిస్తోంది. ఇప్పటికే గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీల నియామకాలలో ఇరువర్గాల మద్య జరిగిన లొల్లి క్షేత్రస్థాయిలో పార్టీ గ్రాఫ్ ను డౌన్​ చేసింది. మొన్నటి వరకు పార్టీలో ప్రాధాన్యత లేదంటూ అలకబూనిన సీనియర్లకు పలు కమిటీలలో ఏఐసీసీ అవకాశం కల్పించింది. అందులోనూ సీనియర్ల ఆధిపత్యపోరు కొనసాగడం గమనార్హం. పలువురు చైర్మన్లు, సీనియర్లతో సంప్రదింపులు జరపకుండా గాంధీభవన్​ వేదికగా సమావేశాలు నిర్వహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కనీసం టీపీసీసీ చీఫ్ దృష్టిలో లేకుండానే సమావేశాలు జరుగుతున్నట్లు తెలిసింది.

కమిటీలు కాదు.. టిక్కెట్లే ముద్దు

పార్టీలో ప్రాధాన్యం కోసం పాకులాడిన పలువురు నేతలు ఇప్పుడు ఎమ్మెల్యే టిక్కెట్లపై గురి పెట్టారు. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా పోటీలో ఉండాలని నిర్ణయించుకున్న వారందరూ టిక్కెట్ల కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి వెయ్యికి పైగా దరఖాస్తులు దాఖలు కావడం, పలు నియోజకవర్గాలలో తీవ్ర పోటీ ఉండడంతో టిక్కెట్లు రావడం అనుమానంగా ఉన్న నేతలకు పార్టీ కమిటీలలో చైర్మన్లు, కో చైర్మన్లు, కన్వీనర్లు, సభ్యులుగా అవకాశం కల్పించారు. ఇలా ఇప్పటి వరకు పదికి పైగా కమిటీలను ఏఐసీసీసీ ప్రకటించింది. ఇప్పటికే అభ్యర్థుల తుది జాబితా ఖరారైందనే సమాచారంతో సీనియర్లు టిక్కెట్లపై బెంగ పెట్టుకున్నారు. ఒకవేళ పార్టీ టిక్కెట్టు ఇవ్వకపోతే రెబెల్ గానైనా బరిలో దిగాలనుకుంటున్నారు.

అనుకూలం నుంచి ప్రతికూలం (బాక్స్​)

మొన్నటి వరకు ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుపునకు ఉన్న అనుకూలత, సీనియర్ల పుణ్యమా అని క్రమంగా ప్రతికూలంగా మారుతోంది. బీఆర్ఎస్, బీజేపీ పట్ల రాష్ట్ర ప్రజలలో ఉన్న వ్యతిరేకతను టీపీసీసీ తనకు అనుకూలంగా మలుచుకోవడంలో విఫలమైందని ఇప్పటికే ఏఐసీసీ సైతం గుర్తించింది. రెండు నెలల క్రితం కాంగ్రెస్​ పట్ల ప్రజలలో ఉన్న విశ్వాసం క్రమంగా సడలుతోంది. గీత దాటుతున్న నేతలను దారిలో పెట్టడంలో ఏఐసీసీ సైతం విఫలమైందని ప్రజలు గుర్తించారు. రానున్న రోజులలో సీనియర్ల మధ్య విభేదాలు ఎలాంటి ప్రతికూల పరిస్థితులకు దారి తీస్తాయోననే ఆందోళన పార్టీ శ్రేణులలో నెలకొంటున్నది. పట్టు తప్పుతున్న కాంగ్రెస్​ వైపు మొగ్గు చూపడం కంటే తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కే జై కొట్టాలని ప్రజలు భావిస్తున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికలలో తమదే గెలుపంటూ కుండబద్దలు కొట్టిన సీనియర్లు గతంలో బస్సుయాత్ర, ధరణీ ఫైల్స్, సెల్ఫీ విత్ డెవలప్ మెంట్​వంటి కార్యక్రమాలు చేపడతామంటూ ఊదరగొట్టారు. అవి అమలైతే క్షేత్రస్థాయిలో పార్టీ బలపడుతుందని శ్రేణులు సైతం భావించారు. కానీ, సీనియర్ల ప్రకటనలు మీడియాకే పరిమితం కావడం, క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చకపోవడంతో కాంగ్రెస్​ ఇచ్చిన హామీల అమలుపై ప్రజలలో విశ్వాసం సన్నగిల్లుతోందని చెబుతున్నారు. రానున్న రోజులలో తెలంగాణలో కాంగ్రెస్​ గెలుపునకు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? సీనియర్ల మధ్య సయోద్య కుదర్చడంలో ఏ మేరకు సఫలమవుతుంది? వేచి చూడాలి.