రక్తదానాలు.. సేవా కార్యక్రమాలు

రక్తదానాలు.. సేవా కార్యక్రమాలు
  • రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా కేటీఆర్ బర్త్​డే
  • విషెస్​చెప్పిన రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు
  • ఆకాశంలో ఎగురుతూ శుభాకాంక్షలు చెప్పిన సంతోష్​అనే యువకుడు
  • గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా కార్యక్రమాలు నిర్వహించిన నేతలు

ముద్ర,  తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రిసెడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పలు కార్యక్రమాలను చేపట్టారు. వినూత్న రీతిలో ఆయన వేడుకలను జరుపుకున్నారు. కొందరు కేక్ కట్ చేసి.. పండ్లు పంచగా, మరికొందరు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు.  తన జన్మదినం సందర్భంగా ప్రచారానికి ఖర్చు చేయకుండా ఆ డబ్బును అనాథలకు అండగా నిలిచేందుకు ఉపయోగించాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్​సూచించారు. దీంతో  రాష్ట్రంలో పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు జరిగాయి. కాగా తన 47వ పుట్టిన రోజు సందర్భంగా 47 మంది అనాథ విద్యార్థులకు సాయం చేస్తానని కేటీఆర్ ప్రకటించారు. రాజకీయ ప్రతినిధులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, అంతర్జాతీయ నేతలు సహా పలువురు అధికారులు కేటీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పారు.

  • ఆకాశంలో విహరిస్తూ విషెస్..

కేటీఆర్ కు పుట్టినరోజు సందర్భంగా సంతోష్ అనే యువకుడు వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పారు. హ్యాపీ బర్త్​డే కేటీఆర్.. అని రాసి ఉన్న ఫ్లెక్సీని పట్టుకొని పారాచూట్ సహాయంతో ఆకాశంలో ఎగురుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియోను ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేసి పోస్టు చేశారు. దీనికి రియాక్ట్ అయిన మంత్రి కేటీఆర్.. ప్రత్యేక ధన్యవాదాలు సంతోష్ అంటూ రిప్లై ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

  • శుభాకాంక్షలు చెప్పిన మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి మంత్రి కేటీఆర్​కు బర్త్ డే విషెస్ చెప్పారు. ‘మై డియర్ బ్రదర్ తారక్.. నేను అభిమానించే.. ప్రేమించే అసలైన నాయకుడు మీరు . మమ్మల్ని మీరు ఎంతగానో ఇన్ స్పైర్ చేస్తారు. మీరు ఆరోగ్యంతో వర్థిల్లాలని కోరుకుంటూ.. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో సెలబ్రేట్ చేసుకోవాలి.’ అంటూ చిరు ట్వీట్ చేశారు. చిరు ట్వీట్​కు కేటీఆర్ రియాక్ట్ అవుతూ ‘థాంక్యూ సార్’ అని రిప్లై ఇచ్చారు. అలాగే కేటీఆర్‌కు రాజ్యస‌భ ఎంపీ సంతోష్ కుమార్ జ‌న్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బ‌ర్త్ డే అన్నయ్యా అంటూ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. మీతోఉన్న ప్రతి జ్ఞాప‌కం త‌న హృద‌యానికి ద‌గ్గరగా ఉంటుంద‌ని పేర్కొన్నారు. మీ అంకిత‌భావం, ద‌య‌, దూర‌దృష్టిగ‌ల నాయ‌క‌త్వం తామంద‌రికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంద‌ని సంతోష్ కుమార్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. థాంక్యూ సంతూ అంటూ కేటీఆర్ రీ ట్వీట్ చేశారు. మరి కొందరు నేతలు దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలను పంపిణీ చేశారు.

  • మినిస్టర్ క్వార్టర్స్ లో..

మినిస్టర్ క్వార్టర్స్ లో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్​రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకులు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రితో కలిసి ఆయన మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి,నల్లగొండ, భువనగిరి యాదాద్రి జడ్ పి చైర్మన్లు బండా నరేందర్ రెడ్డి,ఎలిమినేటి సందీప్ రెడ్డి, నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ తోపాటు గాధరి కిశోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, ఎన్.భాస్కర్ రావు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,పైళ్ల శేఖర్ రెడ్డి,రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమా భరత్ కుమార్, మాజీ సివిల్ సప్లైస్  కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస రెడ్డి,మాజి ఉన్నత విద్యామండలి చైర్మన్ ఒంటెద్దు నరసింహా రెడ్డి,నంద్యాల దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • బస్సుపై రాష్ట్ర  ప్రగతిని వివరిస్తూ..

మంత్రి కేటీఆర్ కు ఆ  పార్టీ నేత అలిశెట్టి అరవింద్ వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 12 అడుగుల ఎత్తు 45 అడుగుల వెడల్పు కలిగిన భారీ  బస్సుకు ఇరువైపులా మంత్రి కేటీఆర్ సాధ్యంలో సాధించిన విజయాలను వివరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. టీ హబ్, దుర్గం చెరువు ఫ్లైఓవర్, టీ వర్క్స్, నగరంలోని పలు ఫ్లైఓవర్లను ఇందులో పొందుపరిచారు.  ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసిన ఈ వాహనం  ఉదయం 6 గంటల నుంచి పది రోజులపాటు నగరంలోని వివిధ ప్రాంతాలలో సంచరిస్తుంది.‌

  • మొక్కలు నాటిన ఎంపీలు..

కేటీఆర్  పుట్టిన రోజు వేడుకలను న్యూఢిల్లీ తుగ్లక్ రోడ్డులోని సీఎం కేసీఆర్ స్వగృహంలో  ఘనంగా జరిగాయి. ఎంపీలు నామా నాగేశ్వరరావు, కే. కేశవరావు నేతృత్వంలో  కేక్ కట్ చేసి, వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి, ఒకరినొకరు స్వీట్లు తినిపించుకుని, కేటీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు సంతోష్ కుమార్, సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, బండి పార్థసారధి రెడ్డి,దామోదర్ రావు , ప్రభాకర్ రెడ్డి, బేబీ పాటిల్, పోతుగంటి రాములు, దయాకర్, వెంకటేష్ నేత, మన్నే శ్రీనివాస్ రెడ్డి, రంజిత్ రెడ్డి,  రవిచంద్ర, మాలోత్ కవిత, తదితరులు ఉన్నారు.

  • టమాటలు పంచిన బీఆర్ఎస్ నేతలు..

మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని బీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి పేదలకు టమటాలను పంపిణీ చేశారు. వరంగల్ చౌరస్తాలో రాజనాల శ్రీహరి మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా 200  మంది పేదలకు గులాబీ రంగు బుట్టలో టమాటాలు ఉచితంగా అందజేశారు. గతంలోనూ కూడా ఆయన వినూత్నంగా కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే.  గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం రోజు లిక్కర్, చికెన్ పంపిణీ చేయగా, ప్రస్తుతం టమాటాల పంపిణీతో మరోసారి వార్తల్లో నిలిచారు.

  • ఆటోలో ఊచిత ప్రయాణం

కేటీఆర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయన వీరాభిమాని అయిన గంధం ఆనంద్ తన ఆటోలో ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌక కల్పించారు. అలాగే 51 మందికి ఐదు రూపాయల భోజనాన్ని అందించారు.

  • ఉచితంగా హైల్మెట్ల పంపిణీ

శాసన  మండలి విప్  ఎంఎస్ .ప్రభాకర్ రావు శాసన మండలి సచివాలయ సిబ్బందికి ఉచితంగా హెల్మెట్ల ను పంపిణీ చేశారు .ద్వి చక్రవాహనాలను నడిపేప్పుడు హెల్మెట్ల ను విధిగా ధరించాలని ,రోడ్డు నిబంధనలు పాటించాలని  ఈ సందర్భంగా ఆయన పిలుపు నిచ్చారు . గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా  చిరు ప్రయత్నంగా ఉచిత హెల్మెట్ల పంపిణీని ప్రారంభించానని ప్రభాకర్ చెప్పారు . వంద హెల్మెట్లను  ఈ కార్యక్రమం లో పంపిణీ చేశారు.