నేటి నుంచి టీఫీన్​ బైఠక్ లు

నేటి నుంచి టీఫీన్​ బైఠక్ లు
  • బీజేపీ పటిష్టత, సమన్వయం పెరిగేలా ప్రణాళిక

ముద్ర, తెలంగాణ బ్యూరో:  బీజేపీ తలపెట్టిన టిఫిన్​ బైఠక్​ల కార్యక్రమం కొత్తదేమి కాదు. ఇది ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోనే ప్రారంభించారు. వారణాసిలో టిఫిన్​ బైఠక్​ల కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ బైఠక్​ల ద్వారానే పార్లమెంటు స్థానాన్ని ఈజీగా దక్కించుకుంది. వీటి ద్వారానే నరేంద్రమోడీ ఎన్నికల్లో గెలవడానికి మంచి ఊపు తెచ్చింది. ఈ బైఠక్​లు సరైన విధంగా చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయనేది వారణాసిలో జరిగింది. అందుకే ప్రయోగాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రవేశపెట్టారు. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ బాగా ప్రచారం పొందింది. దీనిద్వారానే ఆ పార్టీలో మంచి ఊపు, ఫలితాలు వచ్చాయి. అందుకే మన రాష్ట్రంలోను టిఫిన్​ బైఠక్​లను ప్రారంభించింది. వీటిని సోమవారం నుంచి ఆయా ప్రాంతాల్లో జరుగనున్నది.    బీజేపీ పార్టీ నేతలు, కార్యకర్తలంతా ఒకే పరివారమని చాటేలా, వివిధ అంశాలపై ఆరోగ్య కరమైన చర్చలు జరిగేలా బీజేపీ చేపట్టిన టీఫిన్​ బాక్స్​ బైఠక్​లను నిర్వహిస్తున్నది. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో నిర్వహించే ఈ లంచ్​బేటీలకు కార్యకర్తలు ఎవరికీ వారే టిఫిన్​ బాక్స్​లు తెచ్చుకొని, సహపంక్తి భోజనాలు చేయనున్నారు. ఫోటోలు, వేదిక, బ్యానర్లు, మీడియా, భారీగా బోజనం ఏర్పాట్లు వంటి రాజకీయ హంగు, ఆర్భాటాలేవి లేకుండా పార్టీ నేతలు, కార్యకర్తలు కలుసుకునేలా వీటి నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ భేటీల సందర్భంగా కార్యకర్తలు పిచ్చాపాటిగా అన్ని విషయాలపై మాట్లాడుకోవడంతో పాటు వివిధ అంశాలపై ఆరోగ్యకరమైన చర్చకు అవకాశం ఉంటుంది అని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రజలకు మరింత సేవ చేసేలా ప్రోత్సాహం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పార్టీ పటిష్టత తదితర అంశాలపై లంచ్​ భేటీల్లో దృష్టి పెట్టనున్నారు.

త్వరలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో శక్తి కేంద్రాల ఇంఛార్జులు (మూడు, నాలుగు పోలింగు బూత్​లు కలిపి ఓ శక్తి కేంద్రం ), ఆ పై స్థాయిల వారు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వంద మంది, అంతకు మించి పాల్గొనేలా కార్యక్రమాలు రూపొందించనున్నారు. ప్రధానంగా దశాబ్ధాలుగా దేశ రాజకీయాల్లో ఏర్పడిన కాంగ్రెస్​ కల్చర్​కు, ఏదో ఒక రూపంలో పెద్ద ఎత్తున ఖర్చు చేసే పద్దతికి చెక్​ పెట్టేలా పార్టీ నాయకులు, కార్యకర్తల సాదర సమావేశాలకు రూపకల్పన చేశారు.  ఈ కార్యక్రమంలో ఒక్కో నేత ఒక్కో ప్రాంతానికి అతిథులుగా వెళ్లనున్నారు. హైదరాబాద్​లోని ముషిరాబాద్​కు ఎంపీ, పార్టీమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, గద్వాల్ కు జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ, కరీంనగర్ లో​ ఎంపీ బండి సంజయ్​, ఆర్మూర్​లో నిజామాబాద్​​ ఎంపీ డి అరవింద్​, బోథ్​లో ఆదిలాబాద్​ ఎంపీ బాపూరావు, హూజురాబాద్​లో  ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్​ ఈటెల రాజేందర్, దుబ్బాకలో ఎమ్మెల్యే రఘునందన్​రావు, మలక్​పేటలో మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రాసేనరెడ్డి, మునుగోడులో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పదాధికారులు పాల్గొననున్నారు. అందుకే ఈ బైఠక్​లు పార్టీలో నాయకులు, కార్యకర్తల మధ్య ఏదైనా గ్యాప్​ వచ్చిన కూడా సమన్వయం పర్చుతున్నట్లు తెలిసింది. దీంతో ఈ బైఠక్​లు సమర్థవంతంగా నియమించేందుకు బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బంగారు శ్రుతి 119 నియోజకవర్గాలకు ఇంఛార్జీలను కూడా నియమించింది. ఈ ఇంఛార్జీలు సమర్థవంతంగా నియమించాలని పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతోనే పార్టీలోని ఇంఛార్జీలు అయా ప్రాంతాల్లో బైఠక్​లను నియమించనున్నారు.