స్టేషన్ ఘన్ పూర్.. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ?

స్టేషన్ ఘన్ పూర్.. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ?

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: ఎవరికి వారే.. యమునా తీరే... అన్న చందంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా అసలు అభ్యర్థి ఎవరనేది పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఓటర్ల ముందున్న వెయ్యి డాలర్ల ప్రశ్న. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండి అధికార టిఆర్ఎస్ పార్టీతో సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బిజెపి, బి.ఎస్.పి, జనసేన, కమ్యూనిస్టులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం బరిలో దిగిన దాఖలాలు ఉన్నాయి. నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్న నేపథ్యంలో ముందస్తుగా టిఆర్ఎస్ టిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది. ఇక ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల ప్రకటన ఇంకా కొలిక్కి రాలేదు. టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న నేతలందరూ ఎవరి స్థాయిలో వారు టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తూనే గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అధికార టిఆర్ఎస్ పార్టీ 9 ఏళ్లలో నియోజకవర్గానికి వర్గబెట్టిందేంటని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుందంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి టిక్కెట్ ఆశిస్తున్న గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన సింగపురం ఇందిరా, కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బొల్లెపల్లి కృష్ణ, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు, గత ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన దొమ్మాటి సాంబయ్య, సీనియర్ నాయకుడు టి పి సి సి కార్యదర్శి గంగారం అమృత రావు ఇటీవల తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి లో ప్రకటించిన మేనిఫెస్టోతో గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు ఆశిస్తున్న చేపూరి వినోద్ కుమార్, డాక్టర్ చేపూరి చిరంజీవి, డాక్టర్ సిహెచ్ రాజమౌళి, నగేష్, దయాకర్ తదితరులు వారి వారి స్థాయిలో గ్రూపులుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఎవరికి వారే, గ్రూపులుగా అభిమానులతో ప్రచారాన్ని నిర్వహిస్తుండగా అసలు అభ్యర్థి ఎవరు అనేది పార్టీ శ్రేణులు, ఓటర్లను వేధిస్తున్న ప్రశ్న. ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటికీ అసలు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేది తేలక పోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.