ఆ ధైర్యం కేసీఆర్ కు లేదు

ఆ ధైర్యం కేసీఆర్ కు లేదు
  • నా కళ్లలోకి సూటిగా చూడలేరు
  • జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత సమీకరణాలు మారాయి
  • ఢిల్లీకి వచ్చి కేసీఆర్ ఎన్డీయేలో చేరుతానంటే ‘నో’ అన్నా
  • కేటీఆర్​సీఎంను చేస్తా ఆశీర్వదించమంటే కుదరదన్నా
  • ప్రతిపక్షంలో ఉంటాం.. కానీ, అవినీతిపరులతో జత కలవం
  • అవకాశమివ్వండి కేసీఆర్, బీఆర్ఎస్​తిన్నదంతా కక్కిస్తా
  • దక్షిణ భారతదేశాన్ని మోసం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర
  • తమిళనాడులో  ఆలయాలను యథేచ్ఛగా దోచుకంటున్నారు
  • మైనార్టీ ప్రార్థన మందిరాల జోలికెళ్లని కాంగ్రెస్​పాలిత రాష్ట్రాలు
  • నిజామాబాద్​జనగర్జనలో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
  • తెలంగాణలో రూ.8,021 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం

ముద్ర, తెలంగాణ బ్యూరో: తన కళ్లలో కళ్లు పెట్టి చూసే ధైర్యం సీఎం కేసీఆర్ కు లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్​ ఎన్నికల తర్వాత ఢిల్లీలో తన వద్దకు వచ్చి​ అమిత భక్తిని ప్రదర్శించిన కేసీఆర్ ఎన్డీయేలో చేరుతాననే ప్రతిపాదన తన ముందు ఉంచారని సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయాల్లో అలసిపోయిన తాను కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తానని, కేసీఆర్ తనతో చెప్పారని పేర్కొన్నారు. ఆశీర్వాదం కోసం కేటీఆర్ ను తన దగ్గరికి పంపిస్తానంటే వద్దన్నానని ‘ఇది రాచరికం కాదు, ప్రజాస్వామ్యం, తెలంగాణ ప్రజలే సీఎంను నిర్ణయిస్తారని’ కేసీఆర్​కు తేల్చి చెప్పేశానని అన్నారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి సంక్షేమం, అభివృద్ధి పనుల పేరిట ప్రజాధనాన్ని దోచుకున్న అవినీతిపరులతో జత కలిసే ప్రసక్తే లేదని మొఖం మీద చెప్పేశానని వ్యాఖ్యానించారు. అందుకే, జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు తెలంగాణకు తాను ఎప్పడొచ్చినా స్వాగతం పలకడానికి వచ్చిన కేసీఆర్ ఆ తర్వాత తనతో దూరం పాటిస్తున్నారని ఆరోపించారు. నిజామాబాదులో మంగళవారం జరిగిన బీజేపీ జనగర్జన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. తెలంగాణతోపాటు దేశ రాజకీయాలనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారాయని, 48 డివిజన్లలో గెలిచిన బీజేపీని చూసి కేసీఆరులో వణుకు మొదలైందని సెటైర్లు విసిరారు. తాము రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉండేందుకైనా సిద్ధమేనన్న మోడీ, ఎట్టిపరిస్థితులలోనూ బీఆర్ఎస్ తో జతకలవబోమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పాలనలో అన్యాయానికి గురవుతున్న రాష్ట్ర ప్రజల తరపున బీజేపీ గట్టిగా పోరాడుతుందని పునరుద్ఘాటించారు.

అధికారమిస్తే  తిన్నదంతా కక్కిస్తా

‘తెలంగాణలో బీఆర్ఎస్ దోపిడీని కళ్లారా చూస్తున్నా, ఒక్కసారి అవకాశం ఇస్తే కేసీఆర్, బీఆర్ఎస్​ నేతలు తిన్నదంతా కక్కించి మీ పాదాల ముందు ఉంచుతా’ అని మోడీ అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తే, సీఎం కేసీఆర్ వాటిని​పక్కదారి పట్టించారని ఆరోపించారు. సకల జనుల సంక్షేమం కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్, ఆయన కుమారుడు, కుమార్తె, అల్లుడు, మేనల్లుడు మాత్రమే ధనికులయ్యారన్నారు. కేసీఆర్​ కుటుంబానికి దోచుకోవడం తప్ప వేరే పనే లేదన్నారు. తెలంగాణలోని ప్రతి కుటుంబాన్ని కేసీఆర్ కుటుంబం కబ్జా చేసిందన్నారు. బీఆర్ఎస్​ పాలనలో అన్ని వర్గాలు అన్యాయానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పాలనకు మరో అవకాశం ఇవ్వొద్దని రాష్ట్ర ప్రజలను కోరారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమన్న మోడీ ఈ సారి ప్రజలందరూ బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారని చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే ట్రాక్​ రికార్డు బీజేపీది అన్నారు. అధికారంలోకి వచ్చాకా ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామన్నారు. దోపిడి పాలన, ఉద్యోగాల కల్పన, మహిళలకు రక్షణ, పారదర్శక పాలన, అన్ని వర్గాల అభ్యున్నతి జరగాలంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. 

నిజాం వారసుల నుంచి విముక్తి

1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, హైదరాబాద్​ సంస్ధానానికి మాత్రం రాలేదని, ఈ ప్రాంతం అప్పుడు నిజాం ఆధీనంలోనే ఉందని మోడీ అన్నారు. ఆ సమయంలో గుజరాత్ బిడ్డ సర్దార్​వల్లభాయ్​పటేల్ చొరవతో హైదరాబాదుకు పూర్తి స్వాతంత్ర్యం లభించిందని అన్నారు. ఇప్పుడు నిజాం వారసులు అయిన బీఆర్ఎస్​ కుటుంబం చేతిలో తెలంగాణ చిక్కుకుందని, అదే గుజరాతీ బిడ్డ అయిన తాను వారి నుంచి తిరిగి తెలంగాణ ప్రజలను రక్షిస్తానని చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ తో లోపాయకారీ మద్దతు ఇచ్చిందని మోడీ ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్​మధ్య రహస్య స్నేహం ఉందన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ అల్లాడుతోందన్నారు.

కాంగ్రెస్​ పయనాన్ని ‘ఇండియా’ ప్రశ్నించాలి

‘అధిక జనాభా..అంతే హక్కు’ నినాదంతో ముందుకువెళ్తున్న కాంగ్రెస్ పార్టీ దక్షిణ భారత దేశానికి అన్యాయం చేసే కుట్ర పన్నుతోందని మోడీ విరుచుకుపడ్డారు. జనాభా నియంత్రణలో దక్షిణ భారతంలోని రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయన్నారు. డిమిలిటేషన్ లో​పార్లమెంట్ స్థానాలు తగ్గుతాయన్నారు. దీంతో దక్షిణ భారత దేశంలో మైనార్టీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడులో ఆలయాలను దోచుకుంటుందన్నారని, మైనార్టీల ప్రార్థనా మందిరాల జోలికి మాత్రం వెళ్లడం లేదన్నారు. ‘అధిక జనాభా.. అంతే హక్కు’ మాటలు చెబుతున్న కాంగ్రెస్​ దక్షిణ భారతదేశంలో మైనార్టీల ప్రార్ధనా మందిరాలను తమ ఆధీనంలో తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును, పయనాన్ని ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు ప్రశ్నించాలని డిమాండ్​ చేశారు. బహిరంగ సభకు ముందు ప్రధాని మోడీ రూ.8,021 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ను జాతికి అంకితం చేశారు. మనోహరాబాద్–-సిద్దిపేట రైల్వేలైన్ ను, 20 క్రిటికల్ కేర్ బ్లాకులను ప్రారంభించారు.