ఆగస్ట్ 9 మహేష్ బాబు బర్త్ డే టాలీవుడ్ ‘ప్రిన్స్’

ఆగస్ట్ 9 మహేష్ బాబు బర్త్ డే   టాలీవుడ్ ‘ప్రిన్స్’

ప్రిన్స్ ఎవరూ అనడిగితే టక్కున వచ్చే ఆన్సర్ మహేష్ బాబు. మహేష్ బాబును ఇంట్లో వాళ్లు ముద్దుగా ప్రిన్స్ అని పిలుస్తారు. ప్రిన్స్ అంటే రాజకుమారుడు కదా. మహేష్ బాబు హీరోగా యాక్ట్ చేసిన మొదటి మూవీ పేరు కూడా ‘రాజకుమారుడు’. ఆ రాజకుమారుడు ఇంట్లో వాళ్లకే కాదు, టాలీవుడ్ కు కూడా ప్రిన్స్. 

మహేష్ బాబు అంటే టాలీవుడ్ లో యమ క్రేజ్. ఏ సినిమా చేస్తున్నా… మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచీ బిగ్ హైప్ వస్తుంది. రీజన్ ఏంటంటే … ఇంతవరకూ యాక్ట్ చేసిన ఎన్నో సినిమాలు హిట్ పెరేడ్ చేశాయి. పోకిరి, ఒక్కడు, అతడు, మురారి, బిజినెస్ మేన్, దూకుడు, ఖలేజా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట వంటి బ్లాక్ బస్టర్స్ ప్రిన్స్ అకౌంట్ లో ఉన్నాయి.

సక్సెస్ లు ఇవ్వడంలో బాబు తన ఫాదర్, సూపర్ స్టార్ కృష్ణను మించిపోయాడు. తండ్రిలాగే మహేష్ కూడా రికార్డ్స్ సాధించాడు. దూకుడు సినిమాతో ఓవర్సీస్ లో కలెక్షన్స్ సునామీ సృష్టించాడు. 

ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్

 1975 ఆగస్ట్ 9న పుట్టిన మహేష్ బాబుకు ఇద్దరు అక్కలు, ఒక చెల్లెలు ఉన్నారు. అక్కలు మంజుల, పద్మావతి. మంజుల నటి, దర్శకురాలు, నిర్మాత కూడా. చెల్లెలు ప్రియదర్శిని. ప్రిన్స్ చిన్నప్పుడు అమ్మమ్మ దుర్గమ్మ దగ్గరే పెరిగాడు. చదువు మద్రాస్ లోనే (చెన్నై) సాగింది.

పిల్లలు ఫ్యూచర్ లో ఏ ఫీల్డ్ లో రాణిస్తారో వాళ్ల చిన్నప్పుడే చెప్పవచ్చు. మహేష్ బాబు విషయంలో కూడా అలాగే జరిగింది. డాడీ ఆనాడు టాప్ హీరో కాబట్టి మహేష్ బాబుకు కూడా సినిమాలంటే చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ కలిగింది. నాన్న కృష్ణతో, అన్న రమేష్ బాబుతో కలిసి ‘ముగ్గురు కొడుకులు’ సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఆ సినిమా మంచి హిట్టయింది. (రమేష్ బాబు కొన్ని నెలల కిందట మరణించారు). ఆ తర్వాత

  పోరాటం, శంఖారావం, బజారు రౌడీ, గూఢచారి 117, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు, అన్న తమ్ముడు చిత్రాల్లో ప్రిన్స్ బాలనటుడిగా నటించాడు. అప్పుడు స్కూల్లో చదువుకుంటూ సెలవుల్లో సినిమాల్లో చేశాడు. అయితే డిగ్రీ కంప్లీట్ చేయడానికి కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు. డిగ్రీ పూర్తయ్యాక మళ్లీ సినిమాల్లోకి వచ్చాడు. రాజకుమారుడు పిక్చర్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా మహేష్ బాబు చాలా తక్కువ టైంలోనే ఆడియన్స్ హార్ట్ థ్రోబ్ అయ్యాడు. 

డూండీ మాట నిజమైంది

బాబు గొప్ప స్టార్ అవుతాడని ప్రముఖ దర్శకుడు డూండీ ఎన్నో ఏళ్ల కిందటే చెప్పారు. కృష్ణకు ఎన్నో సక్సెస్ లు ఇచ్చిన డూండీ మాట నిజమైంది. మహేష్ బాబు మూవీస్ హిట్ కావడమే కాదు, బ్లాక్ బస్టర్లుగా రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఆయన కెరీర్ లో గొప్ప టర్నింగ్ పాయింట్ ‘పోకిరి’. ఆ మూవీతో సిల్వర్ జూబ్లీ స్టార్ అయ్యాడు ప్రిన్స్

డ్రీమ్ బాయ్

మహేష్ బాబు కాలేజీ గాళ్స్ కు డ్రీమ్ బాయ్. డ్రీమ్ ప్రిన్స్. బాయ్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి అని అమ్మాయిలు ఊహల్లో తేలిపోతారు. మాంఛి పర్సనాలిటీ, ఎగరేసుకుపోయే అందం ఉన్న మహేష్ బాబును ఎవరిష్టపడరు చెప్పండి. గ్లామర్, పర్సనాలిటీ మహేష్ బాబుకు ఎసెట్. టాలీవుడ్ మోస్ట్ గ్లామ్ హీరో మహేష్ బాబు నటనలో కూడా దూకుడుగానే ఉంటాడు.

యాక్టింగ్, డైలాగ్స్, మేనరిజమ్స్

 ఆయన యాక్టింగ్ లో, డైలాగ్ లో ఇప్పటి ప్రేక్షకుడికి ఇష్టమైన ఓ రకమైన  రఫ్ టచ్ ఉంటుంది. సినిమాల్లో  హీరో హీరోయిన్ వెంటపడడం, ఆ హీరోయిన్ అస్సలు కేర్ చేయక పొగరుగా బిహేవ్ చేయడం చూశాం. కానీ మహేష్ బాబు పిక్చర్స్ లో హీరో కేరక్టర్ కానీ, యాటిట్యూడ్ కానీ డిఫరెంట్ గా ఉంటాయి. పొగరుబోతు హీరోయిన్ తో  మహేష్ బాబు కూడా అంత పొగరుగా, రఫ్ గా, కేర్ లెస్ గా బిహేవ్ చేస్తాడు. అలాంటి రఫ్ నెస్ నే లేడీస్ లైక్ చేస్తున్నారు. సాఫ్ట్ హీరోను లైక్ చేసే ఆడియన్స్ ట్రెండ్ మారింది.

మహేష్ బాబు డైలాగ్స్, మేనరిజమ్స్ బాగా పేలాయి. ‘ఎవ్వడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు’ డైలాగ్ ఎంతగా హిట్టయిందీ అందరికీ తెలుసు. ఇక మేనరిజమ్ గురించి.  శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు సైకిల్ తొక్కే సీన్. ఆ సీన్ మూవీ అంతటా కనిపిస్తుంది. ఫాదర్ జగపతి బాబుతో ఛాలెంజ్ చేసి, సిటీ నుంచి విలేజ్ కు సైకిల్ మీద వస్తాడు. ఆ సీన్  ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో వేరే చెప్పాలా?.

అవార్డులు 

ఈ టాలీవుడ్ ప్రిన్స్ ఉత్తమ నటుడిగా ఎన్నోసార్లు నంది అవార్డుల్ని గెలుచుకున్నాడు. హీరోగా నటించిన మొదటి సినిమా ‘రాజకుమారుడు’ తోనే ఉత్తమ నటుడిగా నంది బహుమతిని సొంతం చేసుకున్నాడు. తర్వాత నిజం, అతడు. దూకుడు, శ్రీమంతుడు సినిమాలలో నటనకు ఉత్తమ నటుడి అవార్డులు వచ్చాయి. ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలలో నటనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నాడు.

  ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమాలో నటిస్తున్న మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

-వి. మధుసూదనరావు