Actress Jamuna Death News: అభినయ నేత్రి జమున ఇకలేరు

Actress Jamuna Death News: అభినయ నేత్రి జమున ఇకలేరు

నటనతో తెలుగు ప్రేక్షకుల మనస్సు దోచుకున్న వన్నెల దొరసాని అందుకే ప్రేక్షకులు కనార్పకుండా అందాన్ని చూచి కన్నులో దాచుకున్నారు. తెలుగు ప్రజలకి మిసమిసల మిస్సమ్మ . గోదారి గట్టు పై గంతులేసే పడుచుపిల్ల. నటనాపాటవంలో అమెను ఎవ్వరూ మీరజాలలేరు. వెండితెరపై అందాన్ని అభినయాన్ని కలబోసి అందిచిన లలనామణి జమున. తెరపై కదలాడిన హంపి శిల్పం. వెండి తెరపై సత్యభామ. తెలుగు చలనచిత్ర యవనికపై ఆమె వైభవ ప్రాభవాలు సినీచరిత్రలో సువర్ణ లిఖితాలు. ఆమె ఆత్మగౌరవ పోరాటాలు నేటితరం నటీమణులకు స్ఫూర్తిదాయకాలు. ఆమె ప్రతిభా సామర్థ్యాలు, రూపలావణ్యాలు ఉత్తమ కథానాయికలకు ప్రామాణికాలు. ఆమె పోషించిన పాత్రలు అనురాగానికి, అనుబంధానికి, ప్రేమకు, ఆర్ద్రతకు అద్దంపట్టినవే. ఆమె హావభావ విన్యాసం ముందు ఎన్నో క్లిష్టమైన సినిమా పాత్రలు సవినయంగా తలలు వంచాయి. క్రమశిక్షణ, నిబద్ధమైన జీవనశైలి ఆమెకు ఆభరణాలు. ఆదర్శ గృహణిగా, సాంస్కృతిక సేవాభిలాషిగా ఆమె అపజయ మెరుగని నిత్య చైతన్యదీప్తి. ఆమే… 

జమున పుట్టింది చారిత్రాత్మక విజయనగర సామ్రాజ్య ముఖ్యపట్టణం హంపిలో.. గుంటూరు జిల్లా దుగ్గిరాల గ్రామం పసుపు పంటకు ప్రఖ్యాతి కావడంతో జమున కుటుంబం ఆ గ్రామానికి వలసవచ్చింది. జమున తండ్రి దుగ్గిరాల నుండే వ్యాపార వ్యవహారాలను నిర్వహించేవారు. చిన్నతనంలోనే దుగ్గిరాల రావడంతో జమున తెలుగు అమ్మాయిగానే పెరిగింది. ఆ ఊరులోనే బాలికల పాఠశాలలో జమున విద్యాభ్యాసం కొనసాగింది. తల్లికి కళల మీద ఉన్న మక్కువతో జమునకు కూడా లలిత కళలమీద ఆసక్తి పెరిగింది. స్కూలు వేడుకల్లో, వార్షికోత్సవాలలో జమున ప్రార్థనా గీతాలు పాడడం, నాటకాల్లో పాత్రలు ధరించడం చేస్తుండేది. ఒకసారి దుగ్గిరాల నాటక సమాజం వారు ప్రదర్శించిన ‘ఢిల్లీ చలో’ అనే సాంఘిక నాటకంలో హీరో చెల్లెలి వేషం వేస్తే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తర్వాత కొన్నాళ్లకు సుంకర-వాసిరెడ్డి రచించిన ‘మాభూమి’నాటకంలో నటించే అవకాశం వచ్చినప్పుడు, బుర్రకథ పితామహుడు నాజర్ శిక్షణ ఇవ్వడం జమున జీవితంలో ఉద్వేగ క్షణాలు! అందులో ‘నరక కూపమీ క్రూర నైజాం పాలన రైతన్నా’ అనే పాటను జమున ఆలపించి ప్రేక్షకుల నుండి కరతాళ ధ్వనులు అందుకుంది. ఒకసారి తెనాలి సమీపంలోని ముండూరులో ‘ఖిల్జీ రాజ్యపతనం’ అనే నాటకం వేయాల్సి వచ్చినప్పుడు, స్థానిక హైస్కూలులో టీచరుగా పని చేస్తున్న కొంగర జగ్గయ్య (ప్రఖ్యాత సినీనటులు) జమునను తన భుజాల మీద ఎక్కించుకొని తీసుకు వెళ్లడం జమున జీవితంలో మరపురాని సంఘటనగా చెప్పుకోవాలి.

 ప్రఖ్యాత బాలీవుడ్ ఛాయాగ్రాహకుడు వి.ఎన్.రెడ్డితో కలిసి సినిమా నిర్మించే ప్రయత్నాల్లో వున్నారు. జమున ఫొటోలను తీయించి బొంబాయిలోని వి.ఎన్.రెడ్డికి పంపారు. ఈలోగా శ్రీమన్నారాయణమూర్తి సిఫారసుతో బి.వి.రామానందం అనే సినీ నిర్మాత తను నిర్మించబోయే ‘జై వీర బేతాళ’ అనే సినిమాలో జమునకు నటించే అవకాశాన్ని కలిపించారు. దాంతో జమున కుటుంబం మద్రాసు వెళ్లింది. కోడంబాకంలో ఉన్న స్టార్ స్టూడియోలో షూటింగు మొదలైంది. అందులో హీరో గుమ్మడి వెంకటేశ్వరరావు. అయితే కొన్ని రీళ్ల సినిమా తీశాక రామానందం మృతితో ‘జై వీర బేతాళ’ నిర్మాణం ఆగిపోయింది. ఈలోగా రాజారావు నిర్మించే ‘పుట్టిల్లు’ సినిమాలో హీరోయిన్ గా జమున పాత్ర ఖరారైంది. అయితే ఆ సినిమా విజయవంతం కాలేదు ‘వద్దంటే డబ్బు’ సినిమా. అందులో జమున, పేకేటి శివరాంకు జోడీగా నటించింది. సినిమా విజయవంతం కాలేదు. అదే సంవత్సరం సారథి ఫిలిమ్స్ వారు తాపీ చాణక్య దర్శకత్వంలో నిర్మించిన ‘అంతా మనవాళ్లే’ సినిమాలో జమున సెకండ్ హీరోయిన్గా నటించింది. అది జమునకు కేవలం మూడవ చిత్రం మాత్రమే. ఆ సినిమా వందరోజులు ఆడింది. అలాగే కె.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అన్నపూర్ణా వారి తొలి చిత్రం ‘దొంగరాముడు’ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుకు చెల్లెలుగా నటించింది. అంతే… జమున దశ తిరిగింది. ఇక వెనక్కి చూసుకోవాలిసిన అవసరం రాలేదు

954లో బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో వాహినీ వారు నిర్మించిన ‘బంగారుపాప’, గోకుల్ ప్రొడక్షన్స్ వారు రజనీకాంత్ దర్శకత్వంలో నిర్మించిన ‘వదినగారి గాజులు’చిత్రాలలో నటించిన జమునకు వెండితెర అగ్రనటులతో హీరోయిన్గా నటించే అవకాశాలు వెంటవెంటనే వచ్చాయి. గోకుల్ ప్రొడక్షన్స్ వారే నిర్మించిన ‘నిరుపేదలు’ సినిమాలో అక్కినేని సరసన హీరోయిన్గా నటించగా ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. నాగూర్ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ‘ఇద్దరు పెళ్లాలు’ సినిమాలో ఎన్.టి. రామారావు సరసన హీరోయిన్ గా నటించినా అది కూడా సరిగ్గా ఆడలేదు. తర్వాత ప్రముఖ దర్శకనిర్మాత, బి.ఎన్.రంగా విక్రమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించిఉన ‘మాగోపి’ చిత్రంలో వల్లం నరసింహారావు సరసన జమున హీరోయిన్గా నటించగా ఆ సినిమా శతదినోత్సవం చేసుకుంది. 1955లో విజయావారి ‘మిస్సమ్మ’ సినిమాలో అమాయకంగా నటించిన జమునకు మంచి పేరొచ్చింది. అలాగే బి.ఎన్.రంగా ‘తెనాలి రామకృష్ణ’ (1956) సినిమా నిర్మించినప్పుడు అక్కినేనికి జోడిగా జమున నటించింది. యన్.టి.రామారావుతో పొన్నలూరి బ్రదర్స్ నిర్మించిన ‘భాగ్యరేఖ’, డి.ఎల్. నారాయణ వినోదా బ్యానర్ మీద నిర్మించిన ‘చిరంజీవులు’లలో కూడా జమున నటించగా ఆ చిత్రాలన్నీ విజయవంతమయ్యాయి. దాంతో హీరోయిన్ ప్రధానాంశాలు గల చిత్రాలకు జమున అచ్చుగుద్దినట్లు సరిపోతుందనే పేరు వచ్చింది. ఆ తర్వాత ‘భూకైలాస్’, ‘పెళ్ళినాటి ప్రమాణాలు, ‘అప్పుచేసి పప్పుకూడు’, చిరంజీవులు’, ‘ఇల్లరికం’, ‘ఈడూజోడూ’, ‘రాముడు భీముడు’, ‘శ్రీకృష్ణ తులాభారం’, ‘గులేబకావళికథ’, ‘లేతమనసులు’, ‘తోడూ నీడా’ ‘ఉండమ్మా బొట్టుపెడతా’, ‘తాసిల్దారు గారి అమ్మాయి’, ‘బొబ్బిలి యుద్ధం’, ‘మట్టిలో మాణిక్యం’, ‘ఏకవీర’, ‘పండంటి కాపురం’, వంటి అనేక సినిమాల్లో నటించి ఆమె తారాస్థాయికి చేరుకుంది. సాహసానికి మారు పేరుగా నిలిచింది.