టాలీవుడ్ మొదటి గ్లామరస్ హీరోయిన్ కాంచనమాల

టాలీవుడ్ మొదటి గ్లామరస్ హీరోయిన్ కాంచనమాల

మనకు కాంచన సినిమా గురించి తెలుసు. నిన్నటి జనరేషన్ హీరోయిన్ కాంచన గురించీ కొందరికి తెలుసు. ఇక ఇప్పటి గ్లామర్ స్టార్స్ రష్మిక మందన, పూజా హెగ్డే గురించి కూడా తెలుసు. కానీ కాంచనమాల గురించి చాలామందికి తెలీదు. నిజం చెప్పాలంటే …. టాలీవుడ్ కు ది ఫస్ట్ గ్లామరస్ హీరోయిన్ కాంచనమాల. ఆమె అందం మహాకవి శ్రీశ్రీని కూడా ఇన్ స్పైర్ చేసింది. అప్పటి మద్రాస్ లో రాక్సీ, బ్రాడ్వే థియేటర్లుండేవి. శ్రీశ్రీ ఓ కవితలో రాక్సీలో నార్మా షేరర్, బ్రాడ్వేలో కాంచనమాల’ అని రాశారు. శ్రీశ్రీని అంతగా కదిలించిన ఆ కాంచనమాల అప్పట్లో యూత్ కు హార్ట్ థ్రోబ్.

1917 మార్చి 5న పుట్టిన ఈ గ్లామర్ క్వీన్ కాంచనమాల మొదట ఓ చిన్న పాత్రతో సినిమాలో ఎంట్రీ ఇచ్చారు. కాంచనమాలను చూసి అప్పటి దర్శకుడు సి. పుల్లయ్య ఆమెతో వై.వి.రావు తీసిన కృష్ణ తులాభారం (1935) లో ఓ వేషం వేయించారు. ఆ సినిమాలో కాంచనమాల అందం చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత  వీరాభిమన్యు (1936) లో ఆమె హీరోయిన్ గా వేశారు.  ఆ తర్వాత కాంచనమాల వెనక్కు తిరిగి చూసే అవసరం కలగలేదు.  విప్రనారాయణ, మాలపిల్ల (1938), వందేమాతరం (1939),మళ్ళీ పెళ్ళి (1939), ఇల్లాలు (1940), మైరావణ (1940), బాలనాగమ్మ (1942) వంటి సినిమాలలో హీరోయిన్ గా వేశారు. గృహలక్ష్మిలో మాత్రం వాంప్ పాత్ర పోషించారు. కాంచనమాలకు బాగా పేరు తెచ్చిన సినిమా మాలపిల్ల. కులాంతర వివాహాలపై ఉద్యమాలు సాగుతున్న రోజుల్లో ఆ సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఆ రోజుల్లోనూ కాంచనమాల స్లీవ్ లెస్ జాకెట్ వేసుకుని కుర్రాళ్లను నిద్రపోనీలేదు.

క్యాలెండర్లపై కాంచనమాల

 స్లీవ్ లెస్ జాకెట్ వేసుకుని, నవ్వుతూ కాఫీ తాగే  కాంచనమాల ఫోటోతో క్యాలెండర్లు కూడా వచ్చాయి. అప్పట్లో కాంచనమాల చీరలు, గాజులకు చాలా క్రేజ్.అలా తొలితరం గ్లామర్ క్వీన్ గా ఓ వెలుగు వెలిగారు కాంచనమాల. 
(నేడు కాంచనమాల జయంతి)                                                                                                                                                        మధుసూదన రావు