వార్తలు చదువుతున్నది కొంగర జగ్గయ్య

వార్తలు చదువుతున్నది కొంగర జగ్గయ్య

ఆకాశవాణి, ఢిల్లీ కేంద్రం, వార్తలు చదువుతున్నది … కొంగర జగ్గయ్య.

ఈ మాటలు చాలామందికి అర్థం కాకపోవచ్చు. కానీ సినిమా నటుడు జగ్గయ్య అంటే నిన్నటి జనరేషన్ వరకూ అందరికీ తెలుసు. బహుశ ఈ తరంలో కూడా కావచ్చు. జగ్గయ్య గారు తెలుగులో మన మొదటి న్యూస్ రీడర్. సినిమాల్లోకి రాక ముందు ఢిల్లీ రేడియోలో 1945 ప్రాంతాల్లో, రెండో ప్రపంచ యుద్ధం సమయంలో వార్తలు చదివారు. కంచులా మోగే ఆ గొంతు మరెవ్వరికీ లేదనాలి. వార్తలకే కాదు, తెలుగు సినిమాలకూ ఆయన కంచుకంఠం. 

జగ్గయ్యగారిలో ఇంకో విశేషముంది. ఆయన గొప్ప సాహితీవేత్త. ఆంగ్ల సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని ఔపోసన పట్టారు. విశ్వకవి రవీంద్రుని గీతాంజలికి జగ్గయ్య అందమైన తెలుగు అనువాదం చేశారు. సినిమా నటుల్లో బాగా చదువుకున్న వారుండొచ్చు. కానీ సాహితీవేత్తలు అరుదు. ఒక గుమ్మడి గారు తప్ప జగ్గయ్యలా భాషాపటిమ ఉన్నవారు నటుల్లో లేరనే చెప్పాలి. తెలుగు సినిమాకు సంబంధించినంతవరకూ గతించిన వీరిద్దరే సాహిత్యోపాసకులు.

1928 డిసెంబర్ 31న గుంటూరు జిల్లా తెనాలి దగ్గరున్న మోరంపూడిలో సంపన్న కుటుంబంలో పుట్టిన జగ్గయ్య తన 11వ ఏటనే ‘లవ’ అనే హిందీ నాటికలో నటించారు. స్టూడెంట్ గా ఉన్నప్పుడే పాలిటిక్స్ వైపు మొగ్గు చూపారు. కాంగ్రెస్ లో చేరారు. స్కూలు చదువు పూర్తయ్యాక ఆయన ‘దేశాభిమాని’ అనే పత్రికలో జర్నలిస్ట్ గా పనిచేశారు. ఆ తర్వాత గుంటూరులో ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారు. కాలేజీ నాటకాల్లో నటించారు. వరసగా మూడేళ్లు ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకున్నారు. ఆ కాలేజీలోనే ఎన్.టి. రామారావు, జగ్గయ్య కలిసి డ్రామాల్లో నటించారు. జగ్గయ్య చిత్రకారుడు కూడా, ప్రముఖ చిత్రకారుడు అడవి బాపిరాజు గారి దగ్గర పెయింటింగ్ నేర్చుకున్నారు. సొంత ఊరులో టీచరుగా పనిచేశారు. తర్వాత న్యూఢిల్లీలో రేడియోలో వార్తలు చదివారు.

సినిమాల్లోకి…

ఇన్ని ఉద్యోగాలు చేసిన తర్వాత జగ్గయ్య సినిమాల్లోకి వచ్చారు. త్రిపురనేని గోపీచంద్ తీసిన ‘ప్రియురాలు’ ఆయన మొదటి చిత్రం. హీరోగానే ఎంట్రీ ఇచ్చారు. ఉయ్యాల జంపాల, ఈడూ జోడూ సినిమాల్లో యాక్ట్ చేసిన జగ్గయ్య హీరోగా ఎక్కువ సినిమాలు చేయలేదు. చాలా సినిమాల్లో సాఫ్ట్ విలన్ గా, కేరక్టర్ యాక్టర్ గా నటించారు.

హీరోను డామినేట్ చేసి… 

జగ్గయ్య సహాయ నటుడిగా, కేరక్టర్ యాక్టర్ గా నటించిన సినిమాల్లో కొన్ని సీన్లలో హీరోను డామినేట్ చేశారు. ‘డాక్టర్ చక్రవర్తి’లో అనుమానించే భర్తగా, ‘ఆత్మబలం’లో హీరోయిన్ ప్రేమను పొందలేక ఆమెను వేధించే శాడిస్ట్ గా జగ్గయ్య అద్వితీయమైన నటనను ప్రదర్శించారు. సుమంగళిలో కూడా ప్రేమించిన వ్యక్తిని పొందలేక, అంతులేని వ్యధకు గురయైన ప్రేమికుడిగా ట్రాజెడీ కేరక్టర్ వేశారు.  అల్లూరి సీతారామరాజులో రూథర్ ఫర్డ్  పాత్ర జగ్గయ్య మరో మైలురాయి. శభాష్ పాపన్న, తల్లిదండ్రులు వంటి చిత్రాల్లో అసమానమైన నటనను ప్రదర్శించారు. కంచుకంఠం జగ్గయ్య కొంతకాలం రాజకీయాల్లో కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 

అవార్డులు

తెలుగు విశ్వవిద్యాలయం జగ్గయ్యకు గౌరవ డిలిట్ ప్రదానం చేసింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇచ్చింది. ఆయనకు కళా వాచస్పతి అనే బిరుదు ఉంది. తన గొంతు, తన పాత్రలతో మెప్పించిన జగ్గయ్య 2004 మార్చి 5న  చెన్నైలో గుండెపోటుతో మరణించారు.

(నేడు కొంగర జగ్గయ్య వర్థంతి).

                                                                                                                                --వి. మధుసూదనరావు.