ఆడుకుంటూ బోరుబావిలో పడిన ఏడేళ్ల బాలుడు

ఆడుకుంటూ బోరుబావిలో పడిన ఏడేళ్ల బాలుడు

భోపాల్: మూతల్లేని బోరుబావులు పలుమార్లు చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంటున్నా, కొన్ని సందర్భాల్లో ప్రాణాలతో బయటపడుతున్నా ఈ తరహా ఘటనలు పునరావృతమతూనే ఉన్నాయి. బోరుబావుల యజమానుల నిర్లక్ష్యం ఇందుకు ప్రధాన కారణమవుతోంది. మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లాలో ఏడేళ్ల బాలుడు మంగళవారం ఆడుకుంటూ పొరపాటున బోరుబావిలో పడిన ఘటన తీవ్ర సంచలనమైంది. వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు బాలుడిని సజీవంగా బయటకు తీసుకు వచ్చేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నాయి.

భోపాల్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఖేర్‌ఖేడి పథార్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బోరుబావిలో పడిన బాలుడిని లోకేష్ అహిర్వార్‌గా గుర్తించారు. మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు అక్కడకు చేరుకుని సహాయక బృందాలను అప్రమత్తం చేసారు. జేబీసీ మిషన్‌ ఘటనా స్థలికి చేరుకుంది. బాలుడి పరిస్థితిని తెలుసుకునేందుకు ఒక కెమెరాను కూడా బోర్‌వెల్‌లోకి పంపినట్టు లటేరి సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ హర్షల్ చౌదరి మీడియాకు తెలిపారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నట్టు చెప్పారు.