2.91 లక్షల మందికి కంటి పరీక్షలు పూర్తి మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా

2.91 లక్షల మందికి కంటి పరీక్షలు పూర్తి మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లాలో ఇప్పటి వరకు 290 గ్రామా పంచాయతీలు, 51 మునిసిపల్ వార్డులలో కంటి వెలుగు శిబిరాలు విజయవంతంగా నిర్వహించి 2,91,336 మందికి కంటి పరీక్షలు నిర్వహించామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రస్తుతం 29 గ్రామ పంచాయతీలు,3 వార్డులలో కార్యక్రమం కొనసాగుతున్నదన్నారు. గురువారం హవేళిఘనాపూర్  మండలం మద్దులవాయిలో కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు.  కంటి పరీక్షలు చేసుకుంటున్న వారిని పరమార్శించి పరీక్షలు చక్కగా చేస్తున్నారా, కంటి అద్దాలు నాణ్యతగా ఉన్నాయా, అద్దాలు పెట్టుకుంటే చూపు సరిగ్గా కనిపిస్తున్నదా  అని అడిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఉచితంగా  కంటి పరీక్షలు నిర్వహిస్తున్నందున కంటి సమస్యలతో బాధపడుతున్న వారందరు  పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. కంటి చూపుకు సరిపోయే రీడింగ్ అద్దాలను అప్పటికప్పుడే ఇవ్వడం జరుగుతుందని, ప్రిస్క్రిప్షన్  అద్దాలను పక్షం రోజులలో ఆశా కార్యకర్తలు  ఇంటికే తెచ్చిస్తారని అన్నారు. ప్రతి రోజు కనీసం 150 మందికి పైగా స్క్రీనింగ్ చేసేలా ఆశా కార్యకర్తలు, ఎఎన్ఎంలు, మహిళా సంఘ సభ్యులు కృషి చేయాలన్నారు. కంటి పరీక్షలు చేసుకున్న వారిలో 40 ఏళ్ళు పైబడినవారికీ 28,540 రీడింగ్ అద్దాలను, ఆ లోపు వారికి 4,880 అద్దాలను పంపిణి చేశామని కలెక్టర్ వివరించారు. అదేవిధంగా 33,395 మంది ప్రిస్క్రిప్షన్ అద్దాలకు రెఫెర్ చేసి 24,168 మందికి కళ్ళ జోళ్ళు అందించామని, మరో 9,227 మందికి  త్వరలో ఆశా కార్యకర్తల ద్వారా అందజేస్తామన్నారు. కాగా కంటి పరీక్షలు నిర్వహించిన వారిలో 2,24,488 మందికి ఎలాంటి సమస్య లేదని నిర్దారణ అయ్యిందన్నారు.

కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. చందు నాయక్, మండల ప్రత్యేకాధికారి విజయలక్ష్మి, తహశీల్ధార్ నవీన్, ఎంపిడిఓ శ్రీరాములు తదితరులున్నారు