బ్లాక్ మార్కెట్లో పత్తి గింజలు

బ్లాక్ మార్కెట్లో పత్తి గింజలు

. * అధిక ధరలకు అమ్ముతున్న వ్యాపారస్తులు .

* పట్టించుకోని అధికారులు.

ముద్ర తుంగతుర్తి తుంగతుర్తి నియోజకవర్గంలో 'శనివారం కురిసిన భారీ వర్షంతో విత్తనాలు విత్తె రైతులు అప్రమత్తమయ్యారు .పత్తి విత్తనాల కోసం విత్తనాల దుకాణాల వైపు దృష్టిసారించారు. రైతులకు కావాల్సిన పత్తి విత్తనాలు తుంగతుర్తి నియోజకవర్గంలో లభ్యం కానట్లు సమాచారం. పత్తి విత్తనాల్లో వివిధ రకాల కంపెనీలకు చెందిన పత్తి విత్తనాలను నియోజకవర్గంలోని వివిధ విత్తన విక్రయ దుకాణాలలో అమ్మకం చేస్తున్నారు. కానీ రైతులకు దిగుబడి బాగా వస్తుందని ఆశిస్తున్న యూఎస్ 4708 కంపెనీకి చెందిన మరో రెండు మూడు రకాల పత్తి విత్తనాలు బ్లాక్ లోకి వెళ్లినట్లు సమాచారం. 850 రూపాయలకు ఒక ప్యాకెట్ అమ్మాల్సి ఉండగా 1250 నుండి1500 వరకు బ్లాక్ లో అమ్మకం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల భోగట్ట .తుంగతుర్తి నియోజకవర్గం లోనే కాదు సూర్యాపేట తదితర పక్క జిల్లాల్లో సైతం ఈ విత్తనాలు లభ్యం కావడంలేదని సమాచారం. పత్తి విత్తనాలు బ్లాక్ లోకి వెళ్లిన విషయాన్ని అధికారులకు తెలుసో తెలియదో కానీ ఇప్పటివరకు ఆయా కంపెనీల విత్తనాలను రైతులకు అందుబాటులోకి తేలేదనేది మాత్రం వాస్తవంగా కనిపిస్తుంది . ఒకరిద్దరు వ్యాపారులు మాత్రం తమకు వచ్చిన యూఎస్ కంపెనీ విత్తనాలను నిజాయితీగానే రైతులకు అందించినట్లు సమాచారం.

తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన మన గ్రోమోర్ సెంటర్లో కొద్ది మంది రైతులకు మాత్రం యూఎస్ 4708 తోపాటు ఇదే కంపెనీ విత్తనాలు కంపెనీ ధరకే అందినట్లు సమాచారం . రైతులకు కావలసిన నాణ్యమైన విత్తనాలు దుకాణాల్లో అడిగితే నాణ్యమైన విత్తనాలతో పాటు ఇతర కంపెనీల విత్తనాలు కొంటేనే మీరు కోరిన విత్తనాలు ఇస్తామని లింకులు కూడా కొంతమంది విత్తన దుకాణదారులు రైతులకు అంట గడుతున్నట్లు సమాచారం .కాలం నెత్తి మీదకు రావడంతో రైతులు చేసేదేమీ లేక దుకాణదారులు అడిగిన బ్లాక్ మార్కెట్ ధర అయినా ఇవ్వడం లేదా వారంట కట్టే ఇతర కంపెనీల విత్తనాలు కొనుగోలు చేయాల్సి రావడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది .ప్రభుత్వం రైతులకు కావాల్సిన విత్తనాలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించిన ఆ దిశగా అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదని పత్తి విత్తనాల బ్లాక్ మార్కెట్ విషయం చెప్పకనే చెప్తుంది .ఇకనైనా అధికార యంత్రాంగం మత్తు వదిలి రైతులకు కావాల్సిన పత్తి విత్తనాలు నాణ్యమైనవి అందించే దిశగా కృషి చేయాలనియావత్ రైతాంగం కోరుతుంది.