బిఆర్ఎస్ నాయకుడిపై 2020లో అటవీ భూకబ్జా కేసు

బిఆర్ఎస్ నాయకుడిపై 2020లో అటవీ భూకబ్జా కేసు
  • ఉదయమే అరెస్టు చేయడానికి వెళ్లిన ఫారెస్ట్, పోలీస్ సిబ్బంది
  • ఎఫ్ఆర్ఓ ముందు ధర్నా
  • స్టేషన్ బెయిల్ ఇచ్చిన అధికారులు

ముద్ర ప్రతినిధి, మెదక్:2020లో బిఆర్ఎస్ నాయకుడు,మెదక్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పై అటవీ భూకబ్జా కేసు నమోదైంది. కాగా గురువారం ఉదయమే అరెస్టు చేయడానికి ఫారెస్ట్, పోలీస్ అధికారులు, సిబ్బంది వెళ్లారు. దీంతో ఎఫ్ఆర్ఓ మెదక్ జెడ్పి వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి ఆధ్వర్యంలో మెదక్ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం ముందు బైఠాయించారు. అటవీ అధికారులు స్టేషన్ బెయిల్ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. వివరాలిలా ఉన్నాయి. మెదక్ జిల్లా హవేలీ ఘన్ పూర్ మండలం గాజిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బిఅర్ఎస్ నాయకుడు, మెదక్ ఎఎంసి డైరెక్టర్ సాప సాయిలు సాయిలుపై 30 గుంటలు కబ్జా చేశారని 2020 సెప్టెంబర్ 17న 27,29,50,1(బీ),58 కింద కేసులు నమోదు చేశారు.ఈ కేసులో అరెస్టు చేయడానికి ఎఫ్ ఆర్ఓ మనోజ్ ఆధ్వర్యంలో అటవీ సిబ్బందితో పాటు హవెలి ఘనపూర్ పోలీసులు వెళ్ళారు. పొద్దు పొద్దున అరెస్టు చేయడాన్ని గ్రామస్తులు తీవ్రంగా ఖండించారు. అటవీ శాఖ అధికారులు దౌర్జన్యంగా, అక్రమంగా అరెస్టు చేసి తీసుకొచ్చారని నిరసిస్తూ మెదక్ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం ముందు  గ్రామస్తులు, బిఆర్ఎస్ శ్రేణులు జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్య రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 

అటవీశాఖ అధికారులు అరెస్టు చేసిన సపా సాయిలుకు తక్షణమే స్టేషన్ బెల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి కానీ ఈ ప్రభుత్వం బిఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు చేస్తుందన్నారు.గాజిరెడ్డిపల్లిలో 2014 నుండి  మా ప్రభుత్వము ఉన్నంతవరకు ఒక్క చెట్టు కూడా నరకలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా  4 వేల మొక్కలు నాటితే అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జెసిబి పెట్టి ఆ మొక్కలన్నింటిని తొలగించాడు. అప్పుడు ఈ ఫారెస్ట్ అధికారులు ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు.కానీ ఒక గుంట పొలం కూడా  దున్నని వ్యక్తి మీద అక్రమ కేసులు పెట్టడం దారుణం అన్నారు. అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చేంతవరకు ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం ముందు నుండి జరగమని హెచ్చరిస్తూ బైఠాయించారు. టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ అక్కడికి చేరుకొని సముదాయించారు.దీంతో తప్పని పరిస్థితిలో స్టేషన్ బెయిల్ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

నోటీసులిచ్చినా రాకపోవడంతో అరెస్ట్:ఎఫ్ ఆర్ఓ

సాప సాయిలకు గతంలో అనేకసార్లు నోటీసు ఇచ్చిన రాకపోవడంతోనే అరెస్టు చేయాల్సి వచ్చిందని మెదక్ ఎఫ్ఆర్ఓ మనోజ్ తెలిపారు. నిబంధన మేరకు అరెస్టు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చామని తెలిపారు. గ్రామంలో మొక్కలు దున్నేసిన వారిపై కూడా కేసులు నమోదు చేశామన్నారు.