టీఎస్పీఎస్సీ రాసిన ప్రతి నిరుద్యోగికి లక్ష రూపాయలు ఇవ్వాలి

టీఎస్పీఎస్సీ రాసిన ప్రతి నిరుద్యోగికి లక్ష రూపాయలు ఇవ్వాలి

బిజెపి జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ డిమాండ్
ముద్ర ప్రతినిధి, మెదక్: టీఎస్పీఎస్సీ పరీక్ష రాసిన ప్రతి నిరుద్యోగికి లక్ష రూపాయలు ఇవ్వాలని బిజెపి జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మెదక్ లో జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. నీళ్లు, నిధులు నియామకాల పేరిట కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం ఒక రాబందులా  తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని ధ్వజమెత్తారు.  ఢిల్లీలో కవిత సారా దందా,  కేటీఆర్ తెలంగాణలో పేపర్ లీకుల దందా చేస్తున్నారని పేర్కొన్నారు. టిఎస్పిఎస్సి పరీక్ష పత్రాల లీకేజీ వల్ల తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావని సిరిసిల్ల నియోజకవర్గంలో  నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు.

ఈ పేపర్ లీకేజీ సంఘటన నుండి ప్రతిక్షణం భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తున్నా ఈ ప్రభుత్వానికి కనికరం లేదన్నారు. సంఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా ఈనెల 25వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఇందిరాపార్కు దగ్గర ధర్నా చౌక్ లో బిజెపి రాష్ట్ర రథసారథి బండి సంజయ్  నేతృత్వంలో మహాధర్నా చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ ధర్నాలో బిజెపి కార్యకర్తలు, నాయకులు,  నిరుద్యోగ యువకులు పాల్గొని సంఘీభావం తెలపాలని గడ్డం శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్, అసెంబ్లీ కన్వీనర్ మధు, సీనియర్ నాయకులు రాజశేఖర్, రఘువీరారెడ్డి, జిల్లా కార్యదర్శి నాగరాజు, పట్టణ అధ్యక్షుడు నాయన ప్రసాద్, రాజు, ఆంజనేయులు, కల్కి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.