సిరిసిల్ల పట్టణం పెద్దూరు బీసీ గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

సిరిసిల్ల పట్టణం పెద్దూరు బీసీ గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర సిరిసిల్ల టౌన్: జిల్లా కేంద్రం లోని పెద్దూరు మహాత్మా జ్యోతిబాఫూలే టీఎస్ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా  కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం రుచి, శుచి తో కూడిన నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. విద్యార్థుల హాజరు ను పరిశీలించగా మొత్తం 427 మంది విద్యార్థులకు గానూ 361 మంది విద్యార్థులు రెసిడెన్షియల్ పాఠశాల లో ఉన్నట్లు ప్రిన్సిపల్ జిల్లా కలెక్టర్ కు తెలిపారు. గురుకుల విద్యార్థుల కోసం సిద్ధం చేస్తున్న వంటకాలను ప్రత్యక్షముగా పరిశీలించి నాణ్యమైన రైస్, కూరగాయలతో తయారు చేసిన  వంటకాలను మాత్రమే విద్యార్థులకు వడ్డించాలని ఆదేశించారు. నిత్యావసరాల స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించగా రిజిస్టర్ లలో అప్ డేట్ లేకపోవడంతో నిర్వాహకులను మందలించారు.

రిజిస్టర్ లలో ఎప్పటికప్పుడు నిల్వ ఉన్న నిత్యావసరాల వివరాలను అప్ డేట్  చేయాలన్నారు. గురుకులంలో వినియోగంలో లేని మినరల్ వాటర్ ప్లాంట్ కు మరమ్మతులు చేపట్టి వెంటనే వినియోగంలోకి తేవాలన్నారు అందుకు మున్సిపల్ కమిషనర్ సహకారం తీసుకోవాలని చెప్పారు. గురుకులం కు మిషన్ భగీరథ కనెక్షన్ ఇవ్వాలని సంబంధిత ఇంజనీర్ల కు సూచించారు. అనంతరం గురుకులంలోని మరుగుదొడ్లను, టాయిలెట్ బ్లాక్ లను పరిశీలించారు. గురుకులంలోని మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలన్నారు. అనంతరం తరగతి గదుల్లో బోధన జరుగుతున్న తీరును, గురుకులంలో ఉన్న విద్యార్థుల బెడ్స్, ఫ్యాన్స్ ఇతరత్రా సదుపాయాలను పరిశీలించారు. భోజనానికి సంభందించిన మెనూ ను తప్పనిసరిగా పాటించాలని వసతి గృహం సిబ్బందిని ఆదేశించారు. గురుకులంలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ప్రిన్సిపల్ కు సూచించారు.

పర్మనెంట్ బిల్డింగ్ నిర్మాణం కు ఎంత ఖర్చు అవుతుందో వివరాలు ఇవ్వండి

ప్రస్తుత మహాత్మా జ్యోతిబాఫూలే టీఎస్ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల అద్దె భవనంలో నడుస్తున్నందున దీని స్థానంలో పర్మనెంట్ బిల్డింగ్ నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో వివరాలు అందజేయాలని జిల్లా కలెక్టర్ ప్రిన్సిపల్ కు సూచించారు. పొరుగున ఉన్న జిల్లాల్లో ఎక్కడైనా శాశ్వత బిల్డింగ్ ఉన్న గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ లతో మాట్లాడి తనకు వివరాలు తెలుపాలని జిల్లా కలెక్టర్ సూచించారు.  ఆకస్మిక తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.