తెలంగాణలో ద్రోహులకు పదవులు : కిషన్​ రెడ్డి

తెలంగాణలో ద్రోహులకు పదవులు : కిషన్​ రెడ్డి

తెలంగాణలో ఉన్న మత పరమైన రిజర్వేషన్లు తీసేయాలని కేంద్ర  మంత్రి కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. అప్పుడే గిరిజనులకు పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు అందుతాయని అన్నారు. తెలంగాణలో పదవులు ద్రోహులకు ఇస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దళిత సీఎం, మూడెకరాల భూమి ఎక్కడ పోయింది? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ జెండాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎగరవేశారు. ఫ్లై ఓవర్ లతో సమస్యలు పరిష్కారం కావన్నారు. ప్రజలకు అనుమతి లేని సెక్రటేరియట్ ఎందుకు? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం కేంద్రం చాలా నిధులు ఇచ్చిందని గుర్తు చేశారు.

తెలంగాణ సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కొసం అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఉద్యమాలు చేసిన అందరికీ కేంద్ర ప్రభుత్వం తరుపున శుభాకాంక్షలు తెలిపారు. నీళ్లు , నిధులు , నియామకాల  కోసం ఉద్యమం జరిగిందన్నారు. ఆదిలాబాద్ నుంచి పాలమూరు వరకు అన్ని ప్రాంతాలు రాష్ట్రం కోసం పోరాటం చేశారన్నారు. 1200 మంది అమర వీరులు అయ్యారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సుష్మాస్వరాజ్ ను స్మరించు కోవాలని, ఆమె రాష్ట్రం కోసం పార్లమెంటు లో పోరాటం చేశారని అన్నారు. ఏ వ్యక్తి వల్లనో, కుటుంబం వల్లనో తెలంగాణ రాలేదని స్పష్టం చేశారు. ఇప్పుడు తెలంగాణ ఒక కుటుంబానికి బానిస అయిందని అన్నారు. అవినీతి విపరీతంగా పెరిగి పోయిందని మండిపడ్డారు. దగా పడ్డ తెలంగాణగా మారిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేకచోట్ల మోసం జరుగుతుందని కిషన్‌ రెడ్డి తెలిపారు. ల్యాండ్ మాఫియా, ధరణి మాఫియా లాంటి వాటితో పాటు అన్ని చోట్ల మాఫియా గా మారిందని ఆరోపణలు గుప్పించారు.