ఆశాలకు కరువైన ప్రభుత్వ ఆశీర్వాదాలు

ఆశాలకు కరువైన ప్రభుత్వ ఆశీర్వాదాలు

*అంగన్వాడీలకు అందని ప్రభుత్వ ఆదరణ నక్క విజయ్ కుమార్

ఎండపల్లి, ముద్ర ఎండపల్లి మండల కేంద్రంలో తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు చేస్తున్న నిరవధిక సమ్మె కు బహుజన సమాజ్ పార్టీ ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జ్ నక్క విజయ్ కుమార్ ఆదివారం సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ, సంక్షేమ మంత్రిగా ఉంటూ గ్రామాలను సురక్షితంగా కాపాడుతున్న ఆశాలను నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతున్న అంగన్వాడీలను పట్టించుకోకుండా ఆశీర్వాదం కావాలని తిరగడం మంత్రి కొప్పులకు సంక్షేమంపై ఎంత అవగాహన ఉందో దీనిని బట్టి తెలుస్తుంది అని అన్నారు.

అంతే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ, ఆశా వర్కర్లు తమ పనికి తగ్గ కనీస వేతనం ఇవ్వాలని అడిగితే ఇది కేంద్ర ప్రభుత్వoతో ముడిపడిన అంశం అని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం సరైనది కాదని ఇదే కార్మికులు మీకు పాలాభిషేకాలు చేసినపుడుగాని,తెలంగాణా రాష్ట్ర సాధన కోసం బతుకమ్మలు ఆడినపుడు గాని మీకు కేంద్ర ప్రభుత్వం గుర్తు రాలేదా అని ముఖ్యమంత్రిని నిలదీశారు. నేను కార్మికుల పక్షపాతిని అని చెప్పుకునే మంత్రి కొప్పుల ఈశ్వర్ గారికి సమ్మె చేస్తున్న ఆశా, అంగన్వాడీ కార్మికులు కనబడం లేదా అని నిలదీశారు.కనీస వేతన చట్టం అమలుచేసి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేని పక్షంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బచ్చల స్వామి,ఎండపెల్లి మండల అధ్యక్షులు తడగొండ కార్తీక్,ఎండపెల్లి మండల కార్యదర్శి శేఖర్, గొల్లపల్లి మండల ప్రధాన కార్యదర్శి విల్సన్,రాజరంపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు సాయి కుమార్,అంజి తదితరులు పాల్గొన్నారు.