ముగ్గురు మంత్రులు అభివృద్ధి ఏది..?

  • గత పాలకులపై కేసు పెట్టే దమ్ము సీఎంకు ఉందా..
  • మరో మూడు నెలల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి..
  • సత్తుపల్లి సభలో బీజెపి శాసనసభ పక్ష నేత వేలేటి మహేశ్వర రెడ్డి..

సత్తుపల్లి, ముద్ర: అబద్ధపు వాగ్దానాలు, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమల్లో ప్రజలకు అరుంధతి నక్షత్రం చూపిస్తుందని బీజెపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఆరోపించారు. బిజెపి విజయ సంకల్పయాత్ర సోమవారం సత్తుపల్లి చేరుకున్న సందర్భంగా ఆర్ అండ్ బి అతిధి గృహం సమీపంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదని, సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి హోదా ఖమ్మం జిల్లాకు లభించినప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పైసా నిధి జిల్లాకు రాలేదని విమర్శించారు. ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేయలేని పరిస్థితి వస్తుందన్నారు. మరో మూడు నెలల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఉండదన్నారు.

పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి కేసిఆర్ ప్రభుత్వాన్ని విమర్శించిన విషయం ప్రజలకు విధితమే అన్నారు.అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్లపై కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏర్పడిన అవినీతిపై సిబిఐ దర్యాప్తు జరిపే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పదవి దళితుడికి దక్కినప్పటికీ దళితులకు న్యాయం జరగటం లేదని ఎద్దేవ చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఏమైందన్నారు. మహిళలకు రూ.2500 పథకం ఎక్కడుం దన్నారు.

కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మకుండా పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. దేశం ఇంకా ముందుకు వెళ్లాలంటే మళ్లీ మోడీ ప్రధానిగా రావాలని ఆయన తెలిపారు.ఆ దిశగా ప్రతి ఓటర్ ఆలోచించాలని కోరారు.కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమందర్ రెడ్డి,రాష్ట్ర నాయకులు ఈవి రమేష్, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, వినోద రావు, కొండపల్లి శ్రీధర్ రెడ్డి, నంబూరి రామలింగేశ్వరరావు, భూక్య శ్యామ్ నాయక్, భాస్కర్ నీ వీరంరాజు,నాయుడు రాఘవరావు, పాలకొల్లు శ్రీనివాసరావు, పరసా రాంబాబు,సుదర్శన్ మిశ్రా, మట్టా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.