మద్యం విక్రయ కేంద్రాల వద్ద పటిష్ట చర్యలు - కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు

మద్యం విక్రయ కేంద్రాల వద్ద  పటిష్ట చర్యలు - కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా కొనసాగుతున్న బార్లు మద్యం దుకాణాలు పర్మిట్ రూములలో ఎలాంటి భద్రతా చర్యలను తీసుకోకుండా నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే చట్టపరంగా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని, పోలీసు కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు అన్నారు. బార్లు మద్యం దుకాణాలు పర్మిట్ రూంలో యజమానులు కనీస పర్యవేక్షణ భద్రత చర్యలు తీసుకోకపోవడం వల్ల నేర సంఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. బుధవారం కరీంనగర్ కమీషనర్ కేంద్రంలో పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు లు సంబంధిత శాఖలకు చెందిన అధికారులు, మద్యం దుకాణాల, బార్ల యజమానులు, పర్మిట్ రూముల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ పైన పేర్కొన్న మద్యం విక్రయాలు జరుపుతున్న వ్యాపారులు ఎక్కడ ఎటువంటి గొడవలు నేర సంఘటనలు జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. మద్యం విక్రయాలు జరిగే ప్రతి కేంద్రం వద్ద యజమానులు సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఏవైనా గొడవలు ఇతర రకాల సంఘటనలు జరిగేందుకు అవకాశం ఉన్నట్లయితే వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. మద్యం విక్రయదారులు ఎలాంటి గొడవలు అల్లర్లు జరగకుండా నియంత్రణకు చర్యలు తీసుకునే బాధ్యత గల వ్యక్తులను ఏర్పాటు చేయడం వారి బాధ్యతగా గుర్తించాలని తెలిపారు. ఈ మధ్యకాలంలో మద్యం విక్రయ దుకాణాల వద్ద జరిగిన రెండు హత్య సంఘటనలకు నిర్వాహకుల లోపం కూడా కారణమని చెప్పారు.

ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ వివిధ రకాల మద్యం దుకాణాల యజమానులు విచ్చలవిడిగా, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే వివిధ రకాల సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. మద్యం విక్రయ కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలుతీసుకుంటున్నామని చెప్పారు. వివిధ మద్యం విక్రయ కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలకు పోలీసు శాఖ తీసుకుoటున్న చర్యలకు తమ వంతు సహకారం అందజేస్తామని తెలిపారు.