పార్లమెంట్ ఎన్నికల్లోగా హామీలు అమలు చేయాలి

పార్లమెంట్ ఎన్నికల్లోగా హామీలు అమలు చేయాలి
  • మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్

ముద్ర ప్రతినిధి, మెదక్:కర్నాటకలో 5 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 8 నెలలు దాటినా హామీలను అమలు చేయలేదని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి పార్టీని గెలిపించాలని కోరారు.ఆదివారం మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. 

జ్వరం వచ్చినా మెదక్ మీటింగ్ కదా అని ఓపిక చేసుకుని వచ్చా అన్నారు. మెదక్ పార్లమెంటులోని 7 అసెంబ్లీల్లో 6 చోట్ల మనమే గెలిచాం. స్వల్పఓట్ల తేడాతోనే మెదక్ లో  పద్మ ఓడిపోయిందన్నారు.  బడ్జెట్ లేదని తెలిసినా కాంగ్రెస్ ప్రజలను ఆశపెట్టి మోసం చేసింన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచే సరిస్థితి లేదని కర్ణాటక ప్రజలు చెప్పారన్నారు.ఆరు నెలల దాటితే స్థానిక ఎన్నికలు వస్తాయి. ప్రజలే మనల్ని వెతుక్కుని మరీ ఓటు వేస్తారని హరీష్ రావు పేర్కొన్నారు. కరెంటు సరిగ్గా రావడం లేదు. మోటర్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నాయి. కరెంట్ మోటార్లను రిపేర్ చేసే వ్యాపారం పెరిగిందన్నారు.  కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఇదే అని ఎద్దేవా చేశారు. 

రేవంత్‌కు సీఎం కుర్చీ కేసీఆర్ బెట్టిన భిక్ష.  పదవి వస్తే బాధ్యత పెరగాలి కానీ రేవంత్ సీఎం పదవిని కించపరుస్తున్నారన్నారు.కాంగ్రెస్ ప్రచారంలో అబద్ధాలు, పాలనలో అసమర్థత. పాలించడం చేతగాక ప్రతిపక్షాలను వేధిస్తు, కేసులు తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతుంటే అసహనంతో దాడులు చేస్తున్నారు. కేసులుపెట్టి బెదిరిస్తున్నారు. మేం కేసులు పెట్టివుంటే సగం మంది కాంగ్రెస్ వాళ్లు జైళ్లలో ఉండేవారన్నారు. రైతుబంధు 15 వేలకు పెంచలేదు. పదివేలు కూడా సరిగ్గా రావడం లేదు. 2లక్షల రైతు రుణమాఫీ చేయలేదు. పింఛన్ 4 వేలు పెరగలేదు. వడ్లకు బోనస్ పెరగలేదన్నారు. 

మహిళలకు 2500 రాలేదు. అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా పింఛన్ పెంచలేదు. పింఛన్ పెంచడానికి ఏ ప్రక్రియ కూడా అసరం లేకపోయినా ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. వందరోజుల్లో హామీలు నెరవేర్చకపతే కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాతపెడతారన్నారు.పార్లమెంటు ఎన్నికల కోడ్ రాకముందే కాంగ్రెస్ హామీలను నిలబెట్టుకుని చిత్తశుద్ధి నిరూపించుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 

మేం ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా అమలుచేశాం. కాళేశ్వరం నీళ్లు తెచ్చి రైతుల కాళ్ళు కడిగాం. ఇంటింటికి మంచినీళ్లు, 11 లక్షలమంది ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి, రైతు బంధు  అమలు చేశామన్నారు. కరోనా కష్ట సమయంలో సైతం ప్రభుత్వం దగ్గర పైసల్లేకపోయినా బిల్లులు, ఎమ్మెల్యల జీతాలు ఆపి రైతుంబంధు ఇచ్చాం. ఇప్పుడు ఏ సమస్యా లేకపోయినా కాంగ్రెస్ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ దళితబంధు పక్కన పెట్టింది. గొల్లకుర్మలకు గొర్రెలు ఇవ్వడం లేదు, 2 లక్షల సాయం కూడా అందలేదు. కేసీఆర్ ప్రారంభించిన పనులను అడ్డుకుంటున్నారు. వచ్చిన నిధులను వెనక్కి పంపుతున్నారు. రేవంత్ పాలనను కేసీఆర్ పాలనతో పోల్చి చర్చలు పెట్టండని కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. 

భవిష్యత్తు మనదే. పార్లమెంటు ఎన్నికల్లో కష్టపడి పనిచేసి మెదక్‌లో భారీగా ఓట్లు వేయిద్దాం. పద్మమ్మ ఓడిపోయినా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాక ప్రభుత్వం మెడలు వంచుతాం. అసెంబ్లీలో ప్రజల పక్షాన కొట్లాడుతామన్నారు.కార్యకర్తలు అధైర్యపడొద్దు. పార్టీ మీకు అండగా ఉంటుంది. చీకటి తర్వాత వెలుగు వస్తుంది. ఓటమి తర్వాత గెలుపు దక్కుతుంది. మెదక్‌లో గులాబీ జెండా ఎగరేస్తామని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.  సభకు అధ్యక్షత వహించిన జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ...ఎవరు కూడా వెనుకడుగువేయకుండా చిన్న ఆటంకంగా భావిస్తూ ముందుకు  దూసుకెళ్లాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

 
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్షాలు చెప్పిన మాయమాటలు నెరవేర్చని హామీలు అన్నీ కూడా ప్రజల్లో ముందుకు తీసుకు వెళ్ళాలన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ, పార్టీ ఇన్చార్జి తిరుపతిరెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఎంపిపి హరికృష్ణ, అధ్యక్షులు శేరి నారాయణరెడ్డి, యమునా జయరాంరెడ్డి, సిద్దిరాములు, జెడ్పిటిసి పట్లోరి మాధవిరాజు, నాయకులు సరాఫ్ యాదగిరి, విజయలక్ష్మి, సుజాత, బట్టి జగపతి, గంగాధర్, దేవేందర్ రెడ్డి, విశ్వం, మామిళ్ళ ఆంజనేయులు, చిన్న, శ్రీనివాస్, అశోక్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఇన్సూరెన్స్ చెక్కులను హరీష్ రావు అందజేశారు.