పెత్తనం కోసమే.. భారత్‌ పొరుగు దేశాలకు చైనా రుణాలు..!

పెత్తనం కోసమే.. భారత్‌ పొరుగు దేశాలకు చైనా రుణాలు..!
Board of China Development Bank

వాషింగ్టన్‌: భారత్‌  పొరుగు దేశాలైన పాకిస్థాన్, శ్రీలంకకు చైనా మితిమీరిన రుణాలు ఇస్తుండటంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. పెత్తనం కోసమే డ్రాగన్‌ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని అగ్రరాజ్యం మండిపడింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ భారత పర్యటన నేపథ్యంలో దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల అసిస్టెంట్ సెక్రటరీ డొనాల్డ్‌ లు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాక్‌కు బోర్డ్‌ ఆఫ్‌ చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ 700 మిలియన్‌ డాలర్ల రుణాలు మంజూరు చేసినట్లు పాక్‌ ఆర్థిక మంత్రి ఇషాఖ్‌ దార్‌ తెలిపారు.

దీని గురించి డొనాల్డ్‌ లును మీడియా ప్రశ్నించగా.. చైనా వ్యవహారంపై భారత్‌తో తీవ్రంగా చర్చిస్తున్నామని తెలిపారు. ''భారత పొరుగు దేశాలకు చైనా మంజూరు చేస్తున్న రుణాల గురించి మేం ఆందోళన చెందుతున్నాం. ఆ దేశాలపై బలవంతంగా పెత్తనం చలాయించేందుకు డ్రాగన్‌ వాటిని ఉపయోగించే అవకాశాలున్నాయి'' అని ఆయన పేర్కొన్నారు.