దేశంలో తొలి లిథియం గిగా సెల్ పరిశ్రమ మనదే...

దేశంలో తొలి లిథియం గిగా సెల్ పరిశ్రమ మనదే...
A surveillance balloon over Indian airspace?
  • రూ.10 వేల కోట్లతో దివిటిపల్లిలో లిథియం పరిశ్రమ
  • 10వేల మందికి ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు
  • ఐటీ పార్క్, లిథియం గిగా పరిశ్రమతో తిరుగనున్న దశ
  • అన్నం పెట్టే పరిశ్రమను అడ్డుకునే కుట్రలు తగవు: మీడియాతో మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, ముద్ర: ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న వాహన  కాలుష్యాన్ని అరికట్టేందుకు దివిటిపల్లి వద్ద అమర్ రాజా సంస్థ ఏర్పాటు చేస్తున్న లిథియం గిగా సెల్ ఫ్యాక్టరీ దేశంలోనే మొట్టమొదటిదని రాష్ట్ర ఎక్సైజ్,  పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రూ.10 వేల కోట్లతో ఈ పరిశ్రమ వల్ల 10వేల మందికి ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎదిరలోశనివారం ఈద్గా పనులను పరిశీలించిన తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడారు.ఎదిర, దివిటిపల్లి సమీపంలో ఇప్పటికే ఐటీ పార్క్ నిర్మాణం పూర్తికావచ్చిందని, ఇప్పుడు లిథియం గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని తెలిపారు.

జిల్లా నుంచి బతుకుదెరువు కోసం 14 లక్షల మంది వలసలు వెళ్లే పరిస్థితి ఉండేదని, ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుతో వలస వెళ్లిన వారు తిరిగి రావడమే కాకుండా స్థానికంగా అనేకమందికి కూడా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కశ్మీర్ లో ఇటీవల కనుగొన్న లిథియం నిల్వలపై ప్రపంచమంతా ఎన్నో ఆశలు పెట్టుకుందని తెలిపారు. ఎలక్ట్రికల్ వాహనాలకు అవసరమైన బ్యాటరీలకు లిథియం గుండెకాయ లాంటిదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ- వాహనాల వల్ల ప్రపంచంలోని వాహన కాలుష్యాన్ని తరిమికొట్టే అవకాశం ఉందన్నారు. మన దివిటిపల్లి లిథియం గిగా ఫ్యాక్టరీలో తయారయ్యే లిథియం గిగా సెల్ బ్యాటరీలపై అందరి దృష్టి ఉందన్నారు. 

- ఉపాధిని అందించే పరిశ్రమను కాపాడుకుందాం.

దివిటిపల్లిలో ఏర్పాటు చేసే లిథియం గిగా సెల్ ఫ్యాక్టరీ వల్ల ఈ ప్రాంతంలోని యువతకు ఉద్యోగ,  ఉపాది అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మేధావులు, విద్యావంతులు, యువత ఈ అంశంపై ఆలోచన చేసి పరిశ్రమ ఏర్పాటుకు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ పరిశ్రమపై కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వారిపై స్థానికులే ఫిర్యాదు చేయాలన్నారు. తప్పుడు ప్రచారం చేసి అభివృద్ధిని అడ్డుకునాలనే కుట్రలను సాగనివ్వబోమన్నారు. కాలుష్యాన్ని తగ్గించడానికి ఏర్పాటు చేస్తున్న పరిశ్రమను అడ్డుకుంటే వారు ద్రోహులుగా మిగిలిపోతారని తెలిపారు. నిజంగా ఈ ప్రాంతానికి  అన్యాయం జరిగే పరిస్థితి వస్తే అలాంటి సందర్భంలో పోరాడేందుకు తామే ముందుంటామని మంత్రి స్పష్టం చేశారు. 

- ఎదిర అంటే ఏరి పారేసినట్లుండే...

తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎదిర అంటే ఏరి పారేసినట్లుండేదన్నారు. కనీసం తాగునీటికి కూడా కటకటలాడే పరిస్థితి ఉండేదని మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేశామన్నారు. ఐటీ పార్క్, లిథియం గిగా ఫ్యాక్టరీ పూర్తయితే ఈ ప్రాంతంలో ఇండ్లు, భూములు, స్థలాల ధరలు ఊహించని విధంగా పెరుగుతాయన్నారు. ఎదిర,  దివిటిపల్లి, అంబటిపల్లి గ్రామాలతో పాటు మన జిల్లా మొత్తం దశ తిరుగుతుందని మంత్రి తెలిపారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్, కౌన్సిలర్ యాదమ్మ, పార్టీ నాయకులు హనుమంతు, అల్లి ఎల్లయ్య, శేఖర్, రాములు, హకీమ్, అజీజుల్లా తదితరులు పాల్గొన్నారు.