ట్రంప్‌పై మరోసారి నేరాభియోగాలు నమోదు

ట్రంప్‌పై మరోసారి నేరాభియోగాలు నమోదు

వాషింగ్టన్‌ : 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా జార్జియా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో నాటి దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (77) ఓడిపోయినా ఆ ఫలితాన్ని తారుమారు చేయడానికి కుట్ర పన్నారని న్యాయ నిర్ణేతల సంఘం (గ్రాండ్‌ జ్యూరీ) నేరాభియోగం నమోదు చేసింది. ఇలా జరగడం ఇది నాలుగోసారి. ట్రంప్‌తో సహా మొత్తం 19 మందిపై అభియోగాలు నమోదయ్యాయనీ, వీరంతా ఈ నెల 25 మధ్యాహ్నం లోపల స్వచ్ఛందంగా లొంగిపోవాలని జార్జియా రాష్ట్ర ఫుల్టన్‌ కౌంటీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఫానీ విలిస్‌ పేర్కొన్నారు. వచ్చే ఆరు నెలల్లోనే ట్రంప్‌పై విచారణ ప్రారంభమవుతుందని ఆశిస్తున్నానని ఆమె తెలిపారు.  కేసు విచారణ ప్రక్రియ టెలివిజన్‌లో ప్రసారమయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే అమెరికా చరిత్రలో ఒక మాజీ అధ్యక్షుడి విచారణ టీవీలో ప్రసారమవడం మొదటిసారి అవుతుంది.

తప్పును అంగీకరించిన ఎన్నికల సిబ్బంది : 2020 ఎన్నికల్లో జార్జియాలో ట్రంప్‌ ఓడిపోయారు. అక్కడ బైడెన్‌ను ఓడించాలంటే ట్రంప్‌నకు ఇంకా 11,780 ఓట్లు అవసరం. వాటిని ఎలాగోలా ‘కనుగొనాల’ని ఆయన జార్జియా ఎన్నికల ప్రధానాధికారికి ఫోన్‌లో చెప్పడం గురించి బయటకు పొక్కడంతో దర్యాప్తు మొదలైంది. జార్జియాలో ట్రంపే గెలిచారంటూ ఎనిమిది మంది నియోజకగణ సభ్యులు బోగస్‌ సర్టిఫికెట్‌పై సంతకం చేశారు. శిక్ష నుంచి మినహాయించే షరతుపై తాము చేసింది తప్పని ప్రాసిక్యూటర్ల ముందు అంగీకరించారు.