డీజిల్ ట్యాంకర్ బోల్తా.. 

డీజిల్ ట్యాంకర్ బోల్తా.. 
  • పేలిన ట్రాన్స్ఫార్మర్,
  • మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది
  • సీ ఐ, ఎస్ ఐ పర్యవేక్షణ

మెట్‌పల్లి ముద్ర:- డీజిల్ ట్యాంకర్ బోల్తా పడి మంటలు వ్యాపించిన సంఘటన మెట్‌పల్లి పట్టణం వెంకట్రావ్ పెట్ వద్ద మంగళవారం ఉదయం జరిగింది.. మేడ్చల్ జిల్లా ఘాట్ కేసర్ నుండి, మల్లాపూర్ మండలం రాఘవ పెట్ వెళుతున్న డీజిల్  ట్యాంకర్ ఉదయం సుమారు 4:30 నిమిషాల ప్రాంతంలో వెంకట్రావ్ పెట్ మూలమలుపు వద్ద టైర్ పేలి బోల్తా పడింది. వాహన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి తప్పించుకోగా ట్యాంకర్ కు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.స్థానికులు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహ్మద్ షాకీర్ సిద్ధికి కి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు.

హుటహుటీన సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, సీ ఐ లక్ష్మి నారాయణ, ఎస్ ఐ లు చిరంజీవి, నవీన్ కుమార్ లు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటలు పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్  వ్యాపించడం తో ట్రాన్స్ఫార్మర్ బారి శబ్దం తో పేలిపోయింది. దీంతో పక్కనే స్క్రాప్ దుకాణం వద్ద ఉన్న స్క్రాప్ కు మంటలు వ్యాపించాయి. మంటలు ఎక్కువ కావడంతో సమీపంలో గురుకుల పాఠశాల, పెట్రోల్ బంక్  ఉండడంతో ఎంత పెద్ద ప్రమాదం సంభవిస్తుందోనని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సుమారు 8 గంటల పాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తేవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు ప్రధాన రహదారి కావడంతో రెండు కిలోమీటర్ల దూరంలో వాహనాలు నిలిచిపోయాయి. జగిత్యాల, నిజామాబాద్ వైపు వెళ్ళే వాహనాలను పోలీసులు దారి మళ్లించారు.ఉదయం పూట ఈ ప్రమాదం జరగడంతో పాఠశాల, కళాశాల ల విద్యార్థులు, వివిధ పనులకు వెళ్ళేవారు ఇబ్బందులకు గురయ్యారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు.