సీపీఎం ఆధ్వర్యంలో రైతుల రాస్తారోకో

సీపీఎం ఆధ్వర్యంలో రైతుల రాస్తారోకో

అర్వపల్లి , ముద్ర: వేసవిలో కురిసిన అకాల వర్షాలు, వడగండ్లవాన  మూలంగా వరి పంట పూర్తిగా కోల్పోయిన అర్వపల్లి మండల రైతులను  ఆదుకోవాలని  సీపీఎం సూర్యాపేట  జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం  పార్టీ అర్వపల్లి  మండల కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట–- జనగాం జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వాన రావడం మూలంగా అర్వపల్లి మండల పరిధిలోని  అనేక గ్రామాలలో వేలాది ఎకరాల వరి పంట పూర్తిగా దెబ్బ తిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలు , వడగళ్ల వానలు కురిసి ఐదు నెలలు అయినప్పటికీ నేటికీ ప్రభుత్వం, అధికారులు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం రైతాంగానికి ఇవ్వలేదన్నారు. అనేకసార్లు  జిల్లా కలెక్టర్,  ఆర్డీవో తహసీల్దార్ లకు  విన్నవించినా  నేటికీ పట్టించుకున్న నాథుడే  కరువయ్యాడని  అన్నారు. రైతాంగానికి నష్టపరిహారం చెల్లించేంతవరకు సీపీఎం   ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తక్షణమే జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని వరి పంటను నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రెండు వేల  రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.