ఇదర్ క ‘మాల్' ఉదర్! ఆంధ్రాకు తరలుతున్న సీఎంఆర్ ధాన్యం?

ఇదర్ క ‘మాల్' ఉదర్! ఆంధ్రాకు తరలుతున్న సీఎంఆర్ ధాన్యం?

కేసముద్రం, ముద్ర: రైతుల నుంచి యాసంగి సీజన్లో కొనుగోలు చేసి ప్రభుత్వం కస్టం మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) కోసం ఇచ్చిన దొడ్డు రకం ధాన్యాన్ని రా రైస్ మిల్లర్లు కొందరు ఆంధ్రాకు తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యాసంగి సీజన్లో పండిన దొడ్డు రకం ధాన్యాన్ని రా రైస్ మిల్లర్లకు బియ్యం పట్టించేందుకు ప్రభుత్వం ఇవ్వగా, ఆ ధాన్యంలో ప్రభుత్వం నిర్దేశించిన విధంగా బియ్యం వచ్చే పరిస్థితి లేదని, కొందరు రా రైస్ మిల్లర్లు వందల కోట్ల విలువైన ఆ ధాన్యాన్ని ఆంధ్ర ప్రాంతానికి చెందిన బాయిల్డ్ రైస్ మిల్లులకు విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వం రా రైస్ మిల్లర్లకు కింటా ధాన్యం కేటాయిస్తే అందుకు బదులుగా 67 కిలోల బియ్యం రా రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో యాసంగిలో అధికంగా పండిన దొడ్డు రకం ధాన్యం మిల్లు పడితే క్వింటాలకు 20 నుంచి 25 కిలోల రా రైస్ (ముడి బియ్యం) వస్తుండడంతో రా రైస్ మిల్లర్లు చాలామంది ప్రభుత్వం తమకు కేటాయించిన దొడ్డు రకం ధాన్యాన్ని బాయిల్డ్ మిల్లులకు విక్రయించడానికే మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

ప్రభుత్వం మిల్లర్లకు కేటాయించిన దొడ్డు రకం ధాన్యాన్ని క్వింటాలుకు 1,700 నుంచి 1,850 రూపాయల చొప్పున విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ లోని మండపేట, పెద్దాపురం ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన బాయిల్డ్ రైస్ మిల్లులకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అత్యధికంగా ధాన్యం ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. సీఎంఆర్ కోసం కేటాయించిన దొడ్డు రకం ధాన్యాన్ని విక్రయిస్తూ, ప్రభుత్వానికి తర్వాత నింపాదిగా బియ్యం పెట్టవచ్చని కొందరు రా రైస్ మిల్లర్లు ప్రస్తుతం ధాన్యాన్ని విక్రయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. గడచిన రెండేళ్లుగా ప్రభుత్వం మిల్లర్లకు సీఎంఆర్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని ఇప్పటివరకు కూడా బియ్యం పెట్టకుండా దాటవేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆ మిల్లర్ల పట్ల కఠినంగా వ్యవహరించకుండా ఉదాసీనంగా ప్రవర్తిస్తున్నట్లు సమాచారం. దీనితో ప్రస్తుతం కొంతమంది రైస్ మిల్లర్లు ప్రభుత్వ ఉదాసీనతను ఆసరాగా చేసుకుని ఇబ్బడి ముబ్బడిగా ధాన్యాన్ని ఎగుమతి చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. యాసంగిలో పండించిన దొడ్డు రకం దాన్యంలో ప్రభుత్వం నిర్దేశించిన 67 కిలోల బియ్యం వచ్చే పరిస్థితి లేకున్నప్పటికీ, ప్రస్తుతం ఆ ధాన్యాన్ని విక్రయించి వచ్చిన కోట్ల రూపాయల డబ్బుతో వ్యాపార అభివృద్ధి చేసుకొని, ఇతర మార్గాల్లో పెట్టుబడి పెట్టి తరువాత నింపాదిగా చూద్దాంలే అన్న ధోరణితో కొందరు మిల్లర్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ప్రతి ఏడూ ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వానాకాలంలో రా రైస్ మిల్లులకు అధికంగా కేటాయించడం, యాసంగిలో పండించిన దొడ్డు రకం ధాన్యాన్ని బాయిల్డ్ మిల్లులకు అత్యధికంగా కేటాయించడం జరుగుతుంది. అయితే ఈసారి అందుకు భిన్నంగా యాసంగిలో పండించిన దొడ్డు రకం ధాన్యాన్ని బాయిల్డ్ మిల్లులతో పోలిస్తే రా రైస్ మిల్లులకు కూడా పెద్ద ఎత్తున కేటాయించడం అనుమానాలకు తావిస్తోంది. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్ల కోసం ఒత్తిడి పెరగడం, ధాన్యం దిగుబడి అనుకున్న దానికంటే ఎక్కువ రావడంతో అధికారులు చేసేదేమి లేక రా రైస్ మిల్లుల్లో ఇప్పడి ముబ్బడిగా ధాన్యాన్ని దిగుమతి చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఆ ధాన్యాన్ని క్వింటాలుకు 1,800 రూపాయలకు సగటున విక్రయించి, ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి చేస్తే అప్పుడు ఎక్కడో చోట బియ్యాన్ని ఖరీదు చేసి ప్రభుత్వానికి ఇవ్వవచ్చనే ధీమాతో కొందరు రా రైస్ మిల్లర్లు ఇప్పటికే తమకు కేటాయించిన ధాన్యాన్ని రాష్ట్ర ఎల్లలు దాటించి విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఈ యాసంగిలో పండిన ధాన్యాన్ని మిల్లుపడితే క్వింటాలకు 40 కిలోల బియ్యం సగటున వచ్చే పరిస్థితి లేదనేది జగమెరిగిన సత్యం. అయినప్పటికీ రా రైస్ మిల్లర్లు ధాన్యాన్ని దిగుమతి చేసుకునేందుకు ఉత్సాహం చూపడం దొడ్డి దారి వ్యవహారం కోసమేననే విమర్శలు వస్తున్నాయి. గత రెండేళ్లుగా ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లు పట్టించి బియ్యం పెట్టకుండా అనేకమంది మిల్లర్లు ముఖం చాటేస్తుండటంతో, ఇప్పటికే కొంతమంది మిల్లర్లను సివిల్ సప్లై అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టారు. ఈసారి ధాన్యం దిగుమతి చేసుకున్న రా రైస్ మిల్లర్లు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం సీఎంఆర్ కోటా బియ్యం పెట్టడం ఎవరికి సాధ్యం కాదని, దిగుమతి చేసుకున్న దొడ్డు ధాన్యాన్ని బయలుదేరి మిల్లులకు అమ్మి, వానాకాలంలో ధాన్యం కొని బియ్యం పట్టించి ప్రభుత్వానికి సీఎంఆర్ పెట్టడం మినహా మరో గత్యంతరం లేదనే ప్రచారం సాగుతోంది.

అక్రమంగా ధాన్యం తరలింపు.. పెరిగిన చెక్ పోస్ట్ ఆదాయం
తెలంగాణ రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి పత్రాలు లేకుండా (ఈ.పి) అక్రమంగా తరలిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ - ఖమ్మం ప్రధాన రహదారిపై కేసముద్రం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని మరిపెడ వద్ద ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ సిబ్బంది ధాన్యం లారీలను తనిఖీ చేయగా, ఎగుమతి పత్రాలు లేకుండా ధాన్యాన్ని లారీల్లో తరలిస్తుండగా సిబ్బంది తనిఖీ చేసి పట్టుకుంటున్నారు. అక్రమంగా తరలిస్తున్న ధాన్యం విలువలో  ఒక శాతం మార్కెట్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఈ మూడు నెలల్లో చెక్ పోస్ట్ ఆదాయం 50 లక్షల దాటడం ధాన్యం ఆంధ్రాకు తరలుతోందనడానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఏప్రిల్ నెలలో చెక్ పోస్ట్ ఆదాయం 20.98 లక్షలు రాగా, మే నెలలో 21.58, జూన్ నెలలో ఈ పక్షం రోజుల్లోనే 10 లక్షల వరకు ఆదాయం రావడం విశేషం. గత ఏడాది కూడా మరిపెడ చెక్ పోస్ట్ ద్వారా  కోటి 57 లక్షల రూపాయలు కేసముద్రం మార్కెట్ ఆర్జించింది. ఒక్క ఒక్క శాతం పన్ను రూపంలో కేసముద్రం మార్కెట్ చెక్ పోస్ట్ ఆదాయం కోటీ 50 లక్షలు దాటితే, అక్రమంగా ఆంధ్రాకు తరలిస్తున్న ధాన్య విలువ వందల కోట్లలో ఉంటుందనే ఆరోపణలు వస్తున్నాయి.