మానుకోటలో గులాబీ గ్రూప్  వార్..!!

మానుకోటలో గులాబీ గ్రూప్  వార్..!!
  • శంకర్ నాయక్  వద్దంటూ అసమ్మతి గళం
  • భారాస రాజకీయాల్లో కలకలం

ముద్రప్రతినిధి, మహబూబాబాద్: మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఇంతకాలం చాపకింద నీరులా సాగిన రాజకీయవిభేదాలు బట్టబయలయ్యాయి. వచ్చే అసెంబ్లీ న్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కు భారాస నుండి టిక్కెట్ ఇవ్వకూడదని, అభ్యర్థిని మార్చి కొత్తవారికి ఎవరికి టికెట్ ఇచ్చినా గులాబీజెండా ఎగరడం ఖాయమంటూ తమ వాదనను వినిపించారు. మహబూబాబాద్ మండలంలోని ఓ..మామిడితోటలో అసమ్మతివాదులంతా శనివారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు ప్రధాన అనుచరులు ఈ..సమావేశంలో కీలకపాత్ర పోషించారు.

 ఈ..సందర్భంగా మహబూబాబాద్ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ జెర్రిపోతుల వెంకన్నగౌడ్, కేసముద్రం సర్పంచ్ బట్టు శీను, మహబూబాబాద్ మున్సిపాలిటీకి చెందిన పలువురు కౌన్సిలర్ లు, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీనాయకులు మాట్లాడుతూ..  వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు తిరిగి టిక్కెట్ ఇవ్వకూడదని విజ్జప్తి చేసారు. శంకర్ నాయక్ కు టికెట్ ఇస్తే భారాస ఓడిపోతుందని, ఆయనకు తప్ప ఎవ్వరికి టిక్కెట్ ఇచ్చినా తప్పక గెలుస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ..అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఈ..సమావేశంలో సుమారు 150నుంచి200మంది వరకు పాల్గొన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అదేపార్టీకి చెందిన నేతలు అసమ్మతిగళం వినిపించడంతో ఈ..అంశం రాజకీయవర్గాలతోపాటు, సామాన్యప్రజల్లోను  తీవ్రచర్చనీయాంశంగా మారింది..