పొన్నాలను విమర్శించే స్థాయి మీకులేదు

పొన్నాలను విమర్శించే స్థాయి మీకులేదు

– డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లింగాజీ
ముద్ర ప్రతినిధి, జనగామ : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, బీసీలకు ఎనలేని సేవ చేసిన టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై కొందరు లేనిపోని  విమర్శలు చేస్తున్నారని, వారికి ఆ స్థాయిలేదని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాసంపల్లి లింగాజీ మండిపడ్డారు. శనివారం జనగామ నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జనగామ మున్సిపాలిటీ చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా, జిల్లా పరిషత్‌లో జడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, పార్టీలో రాష్ట్ర స్థాయి నామినేట్ పదవుల్లో ఎక్కువ మందికి బీసీలకు అవకాశం ఇచ్చిన ఘనత పొన్నాలదే అని స్పష్టం చేశారు. గతంలో కంటే ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయం ఎలక్షన్స్ లో బీసీలకు అత్యధిక శాతం టికెట్లు ఇచ్చారని గుర్తుచేశారు.

గతంలో పొన్నాల పుణ్యంతో మున్సిపల్ వైస్ చైర్మన్ అవ్వడంతో పాటు పార్టీ రాష్ట్ర స్థాయి పదవులు అనుభవించిన కంచ రాములు ఆ కృతజ్ఞత లేకుండా ప్రస్తుతం ఆయనపైనే విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పొన్నాలను విమర్శించే ముందు తమ స్థాయి ఏమిటో తెలుసుకోవాలన్నారు. బీసీ కార్డు వాడి టికెట్ తెచ్చుకోవాల్సిన ఖర్మ పొన్నాల లక్ష్మయ్యకు లేదని, ‘జనగామ గడ్డ.. పొన్నాల అడ్డా’ అని వచ్చే ఎన్నికల్లో జనగామ అభ్యర్థిగా ఆయన బరిలో ఉంటారని స్పష్టం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్,  ఎన్‌ఎస్‌యూఐ మాజీ జిల్లా అధ్యక్షుడు జక్కుల వేణుమాధవ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు లోక్కుంట్ల ప్రవీణ్, బీసీ సెల్ రాష్ట్ర నాయకులు చింతకింది మల్లేష్, జనగామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ మాజీద్, పట్టణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కట్ట కృష్ణ, రంగు రవి మైనారిటీ సెల్ జిల్లా నాయకులు జాఫర్ షరీఫ్, ఉపాధ్యక్షుడు సుల్తాన్ గోవింద్ రెడ్డి, ఉపాధ్యక్షులు పిట్టల రాజు తదితరులు పాల్గొన్నారు.