6 గ్యారంటీలు నమ్మితే...

6 గ్యారంటీలు నమ్మితే...
  • తెలంగాణ ఆగమైతది
  • కాంగ్రెస్ నాయకులకు మతిభ్రమించింది
  • టిఆర్ఎస్ అభ్యర్థి కడియం 

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయని ఆరు గ్యారెంటీలను నమ్మితే తెలంగాణ ఆగమైతదని టిఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్పష్టం చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఈనెల 28న నిర్వహించే నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమావేశ సభ స్థలిని బుధవారం పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 28న జరిగే ఆత్మీయ సమావేశంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రతిపక్షాల ఆరోపణలను  తిప్పికొట్టే వ్యూహాలను రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యాన్ని రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తున్నారని స్టేషన్ ఘన్ పూర్ లో 200 శాతం గులాబీ జెండా ఎగరడమే కాకుండా ముచ్చటగా మూడోసారి కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. దమ్ముంటే నాపై పోటీ చేయమని రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి కెసిఆర్ కు సవాలు విసరడం, అవకాశం వస్తే నేనే ముఖ్యమంత్రిని అవుతానని కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, జగ్గారెడ్డిలు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయని 6 గ్యారంటీలను తెలంగాణలో ఎలా అమలు చేస్తారని శ్రీహరి కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. ఇప్పటికే ఐదు గంటల కరెంటు ఇవ్వడం లేదని కర్ణాటక ప్రజలు గజ్వేల్, కొడంగల్ వద్ద ధర్నాలు చేస్తున్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తించాలన్నారు. ఆదాయ వనరులను సృష్టించి రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే బిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అన్నారు. నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ఈనెల 28న నిర్వహించే నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని శ్రీహరి పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, చింతకుంట్ల నరేందర్ రెడ్డి, బెల్దే వెంకన్న, పోగుల సారంగపాణి, మామిడాల లింగారెడ్డి, అన్నం బ్రహ్మారెడ్డి, తోట వెంకన్న, రాపోలు మధుసూదన్ రెడ్డి, ఐలోని సుధాకర్, రజాక్, మంద రాజు, పోకల నారాయణ, నాగర బోయిన శ్రీరాములు, అయోధ్య, అశోక్, వెలమ కంటి నాగరాజు, కరుణాకర్ రావు, బాబు, జీడి ప్రసాద్, మెట్టెలి రమేష్ తదితరులు పాల్గొన్నారు.