రైతుల పడిగాపులు...! కేసముద్రం మార్కెట్లో స్తంభించిన కొనుగోళ్లు 

రైతుల పడిగాపులు...!  కేసముద్రం మార్కెట్లో స్తంభించిన కొనుగోళ్లు 

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ లో మంగళవారం వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు స్తంభించాయి. మార్కెట్ కు విక్రయానికి తెచ్చే వ్యవసాయ ఉత్పత్తులను రైతులు ఇష్టానుసారంగా పోస్తుండడంతో కొనుగోలు చేసిన తర్వాత ఎగుమతులు చేయడానికి ఆటంకం కలుగుతోందని గుమస్తాలు, కార్మికులు, వ్యాపారులు మంగళవారం ఉదయం ఈ-నామ్ టెండర్ ప్రక్రియను నిలిపివేశారు. సోమవారం ఖరీదు చేసిన వ్యవసాయ ఉత్పత్తులు అర్ధరాత్రి వరకు కూడా ఎగుమతి చేయలేకపోయామని, కొనుగోలు పూర్తికాకుండానే కొత్తగా పోయడంతో  కొనుగోలు చేసిన రాశుల జాడ దొరకడం లేదని, ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులు ఖరీదు లేమని చేతులెత్తేశారు.

ఈ విషయం తెలుసుకున్న మార్కెట్ చైర్ పర్సన్ నీలం సుహాసిని, మార్కెట్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి అమరలింగేశ్వర రావు వెంటనే వ్యాపారులు, గుమస్తాలు, రైతు ప్రతినిధులతో సమావేశం నిర్వహించి అధికంగా వ్యవసాయ ఉత్పత్తులు విక్రయానికి వస్తుండడంతో ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవమేనని, అయితే గురువారం నుంచి షెడ్ల వారీగా ప్రత్యేకంగా ఇన్చార్జిలను నియమించి  ఏరోజుకారోజు వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించి, కాంటాలు నిర్వహించి ఎగుమతి చేయడానికి అనువుగా మార్కింగ్ చేయిస్తామని హామీ ఇవ్వడంతో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వ్యాపారులు వ్యవసాయ ఉత్పత్తుల ఖరీదులు ప్రారంభించారు. ఈ కారణంగా రైతులు వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాల కోసం మార్కెట్లో పడిగాపులు కాయాల్సి వచ్చింది. మంగళవారం 17వేల బస్తాల పైగా మక్క జొన్నలు, పదివేల బస్తాల వరకు ధాన్యం విక్రయానికి రావడంతో యార్డు పూర్తిగా నిండిపోయింది. దీనితో బుధవారం మార్కెట్ కు సెలవు ప్రకటించారు. ప్రస్తుతం యార్డులో ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు పూర్తి చేసిన తర్వాత గురువారం నుంచి మార్కెట్ ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తామని చెప్పారు.