గొర్రెలు వత్తయో రావో!?

గొర్రెలు వత్తయో రావో!?
  • వాటా చెల్లించేందుకు ఎనక ముందాడుతున్న యాదవులు

కేసముద్రం, ముద్ర: యాదవులకు ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీ పథకంలో ఎంపికైన లబ్ధిదారులు తమ వంతు వాటా డిపాజిట్ చేయడానికి ఎనుక ముందాడుతున్నారు. కొంతమంది యాదవులు లబ్ధిదారుల వాటా కింద డబ్బులు డిపాజిట్ చేసినప్పటికీ ఆంధ్ర ప్రాంతంలో ఆశించిన రీతిలో గొర్రెలు లేవనే ప్రచారంతో ‘ బి' కేటగిరీలో ఎంపికైన లబ్ధిదారులు ఈసారి గొర్రెలు వత్తయా రావా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు మండలాల్లో కలిపి 2017లో గొర్రెల పంపిణీ పథకం అమలు చేసే సమయంలో దాదాపు 5,000 మందిని ఎంపిక చేశారు. అప్పట్లో ఆయా గ్రామాల్లోని గొర్రెల మేకల పెంపకం దారుల సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గ్రామసభల్లో  ‘ఏ' కేటగిరీలో 2,419 మందిని ఎంపిక చేసి గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.  ‘ బి' కేటగిరిలో 2,482 మంది లబ్ధిదారులను అప్పట్లో ఎంపిక చేసిన వారికి ఇప్పుడు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసారి గొర్రెల యూనిట్ల విలువ కూడా 1,75,000 రూపాయలకు పెంచారు. అలాగే లబ్ధిదారుల వాటా కూడా 25 శాతం కింద 31,250 నుంచి 43,750 రూపాయలకు పెంచారు. అయితే ఈసారి అర్హులైన లబ్ధిదారుల కు ప్రత్యేకంగా యూనిక్ ఐడి నంబర్ కేటాయించి ఆ నంబర్ ఆధారంగా నేరుగా లబ్ధిదారు తన బ్యాంకు ఖాతా నుంచి జిల్లా కలెక్టర్ ఖాతాకు ఆర్టీజీఎస్ ద్వారా వాటాదనాన్ని చెల్లించేలా ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. ఎలాంటి అవకతవకలు లేకుండా నేరుగా లబ్ధిదారుడే వాటాదనాన్ని చెల్లించే విధంగా రూపొందించారు. ఈ మేరకు ఇప్పటి వరకు మూడు మండలాల్లో కలిపి 2,400 మందికి పైగా లబ్ధిదారులను గుర్తించి, ఆయా సొసైటీల పరిధిలోని గ్రామాల్లో పశువైద్యాధికారులు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి గొర్రెల పంపిణీ పథకం కోసం దరఖాస్తు చేసుకొని లబ్ధిదారుని వాటా కింద ఆర్టిజిఎస్ ద్వారా డబ్బులు చెల్లించాలని అవగాహన కూడా కల్పించారు. అయితే ఇప్పటివరకు మూడు మండలాల్లో కలిపి గొర్రెల పంపిణీ పథకం కోసం 300 లోపే లబ్ధిదారులు తమ వాటాను చెల్లించి పేర్లు నమోదు చేసుకోవడం గమనార్హం. యాదవులు పెద్ద సంఖ్యలో ఉన్న కొన్ని గ్రామాల్లో ఇప్పటివరకు  లబ్ధిదారుల వాటా చెల్లించడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవడం విశేషంగా మారింది. నెల్లికుదురు మండలంలో ‘బి' కేటగిరిలో 843 మందిని ఎంపిక చేయగా 150 మంది లబ్ధిదారులు గొర్రెల కోసం తమ వాటా చెల్లించగా,  చిన్న ముప్పారం గ్రామంలో కేవలం ఆరుగురికి ఇచ్చి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. మండలంలో ఇప్పటివరకు ఒక్కరి కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఆంధ్ర ప్రాంతంలోని అనంతపురం తదితరచోట్ల గొర్రెలను కొనుగోలు చేయడానికి వెళ్లిన వారికి అక్కడ ఆశించిన విధంగా గొర్రెలు లేవని ప్రచారం సాగుతోంది. పశుసంవర్ధక శాఖ అధికారులు కేవలం లబ్ధిదారులను ఎంపిక చేసి వారి వాటా ధనాన్ని డిపాజిట్ చేయడం వరకే పరిమితం కావడంతో ఆ తర్వాత గొర్రెల కొనుగోళ్ల వ్యవహారాన్ని ఇతర శాఖల అధికారులకు అప్పగించడం వల్ల సమన్వయం లోపించి, అర్హులైన లబ్ధిదారులు తమ వాటా చెల్లించడానికి వెనుక ముందు ఆడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదే కాకుండా కొందరు లబ్ధిదారులు తమ వాటాదనాన్ని చెల్లించి పక్షం రోజులు దాటుతున్నప్పటికీ గొర్రెల పంపిణీ పై ఉలుకు పలుకు లేకపోవడంతో ముందుగా డబ్బులు కట్టిన వారికి గొర్రెలు ఇస్తే చూద్దాంలే అన్న తరహాలో మిగిలిన లబ్ధిదారులున్నట్లు ప్రచారం సాగుతోంది. దీనితో ఈ మూడు మండలాల్లో గొర్రెల పంపిణీ పథకం ఆశించిన తీరులో ముందుకు సాగడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

  • నమ్మకం సన్నగిల్లింది: యాదవ సంఘం అధ్యక్షుడు అల్లం వెంకన్న

ప్రభుత్వం ఆర్భాటంగా గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. ఆ విధంగా త్వరితగతిన లబ్ధిదారులు తమ వాటా చెల్లించగానే గొర్రెల యూనిట్లను అందించడం లేదు. ఆంధ్ర ప్రాంతంలో గొర్రెలు పెద్ద మొత్తంలో లేవని అక్కడికి వెళ్లిన సొసైటీ సభ్యులు చెబుతున్నారు. దీనివల్ల ముందుగానే డబ్బులు డిపాజిట్ చేసి ఇబ్బందులు పడడం ఎందుకని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ పథకంపై యాదవుల్లో నమ్మకం సన్నగిల్లింది. అందుకే లబ్ధిదారులు వాటా చెల్లించడానికి చాలా మంది లబ్ధిదారులు వెనుక ముందు ఆడుతున్నారని కేసముద్రం స్టేషన్ యాదవ సంఘం అధ్యక్షుడు అల్లం వెంకన్న తెలిపారు. మొదటి విడత గొర్రెల పంపిణీ చేసిన వెంటనే రెండో విడత ఇవ్వకుండా ఇంతకాలం జాప్యం చేసి తీరా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పథకాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.